యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 27 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల్లోని నైపుణ్యాలు వెలికితీసి వ్యవసాయంతో పాటు పాడి పశువుల సంపద పెంపునకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాసాయిపేట గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆల్డా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశువులకు వ్యాధులు రాకుండా నిత్యం వాటిని కడుగుతూ ఉండాలని సూచించారు. గోపాల మిత్రల సలహాలతో పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం పశువులకు సంబంధించిన అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మేలు జాతి ఆడ దూడల కోసం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ గర్భాధారణ వ్యాక్సిన్లు త్వరలో అందుబాలోకి వస్తాయన్నారు. సబ్సిడీతో అందిస్తున్న ఈ వ్యాక్సిన్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారంలో ఒకరోజు మాసాయిపేటలో వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా వెటర్నరీ డాక్టర్‌కు సూచించారు. ప్రత్యేకంగా ఒక వెటర్నరీ డాక్టర్ కావాలని గ్రామస్తులు ప్రభుత్వ విప్‌ను కోరారు. దీనికి ఆమె గ్రామంలోని జనాభా, పాడి సంపద వివరాలతో గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వాలని సూచించారు.
పాల ఉత్పత్తిలో ఆలేరు నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరుకుందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉండేవని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సగర్వంగా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంతోనే ఇది సాధ్యమైందన్నారు. అనంతరం గ్రామంలోని డబుల్ బెడ్రూం ఇండ్లు పరిశీలించారు. పెండింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, సర్పంచ్ వంటేరు సువర్ణ, జిల్లా వెటర్నరీ డాక్టర్ కృష్ణ, పాల సంఘం చైర్మన్లు ఒంటేరు ఇంద్రసేనారెడ్డి, బాబూరావు, బాల్‌రెడ్డి, మండల వెటర్నరీ డాక్టర్లు శివరామకృష్ణ, శ్రీకాంత్, ఉపసర్పంచ్ వాకిటి అమృత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వంటేరు సురేశ్‌రెడ్డి, మండలంలోని వివిధ గ్రామాల పాల సంఘం చైర్మన్లు, సూపర్వైజర్లు, గోపాలమిత్రలు, రైతులు పాల్గొన్నారు.