నందికొండ, ఆగస్టు 22 : నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో సోమవారం సాయంత్రం నీటి విడుదలను తగ్గించారు. 10 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను 6 క్రస్ట్ గేట్లకు తగ్గించి 5 అడుగుల మేర ఎత్తి 47,154 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి ఉండడంతో ఎగువ నుంచి వస్తున్న వరదను అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి సా మర్థ్ధ్యం 590 (312.04 టీఎంసీలు ) అడుగులకు 587.70 ( 305 .9222 టీఎంసీలు ) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ నుంచి కుడికాల్వ ద్వారా 9,217 క్యూసెక్కులు, ఎడ మ కాల్వ ద్వారా 8,022 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,151 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతున్నది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 1,76,232 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా 96,344 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది. శ్రీశైలం 885 అడుగులకు 884.40 ( 211. 9572 టీఎంసీ) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. శ్రీశైలానికి 1,11,253 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
పర్యాటకుల సందడి
నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడం తో కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి వచ్చిన పర్యాటకులతో డ్యాం పరిసరాల్లో పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొన్నది. శివాలయం పుష్కర్‌ఘాట్, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం సమీపం, కొత్తవంతెన, ప్రధాన డ్యాం, లాంచీస్టేషన్ వద్ద సందడి కనిపించింది. తెలంగాణ పర్యాటక శాఖ కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన జాలీ ట్రిప్పునకు, నాగార్జునకొండకు పోవడానికి పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. పర్యాటకులతో లాంచీ స్టేషన్, బుద్ధవనం, డ్యాం పరిసరాలు కిటకిటలాడాయి.