యాదాద్రి, ఆగస్ట్టు 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి భక్తుల విడిదికి ఇబ్బందులు లేకుండా దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. స్వామివారిని దర్శించుకునే భక్తులకు దాతల సాయంతో కొండకింద సదనాలు, కాటేజీలను అందుబాటులోకి తెచ్చింది. తులసీ కాటేజీ ప్రాంతంలో సుమారు 170 అద్దె రూంలు, 16 ఏసీ, నాన్ ఏసీ కాటేజీలను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. రోజుకు నామ మాత్రపు అద్దె వసూలు చేస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. సుమారు రూ.1200 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహుడి ప్రధానాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రపంచ భక్తులు గర్వపడేలా పునర్నిర్మించారు.
ఎక్కడాలేని విధంగా పూర్తిగా కృష్ణ శిలలతో వివిధ దేవతామూర్తులు, ఆకృతులతో నిర్మితమైన ఆలయాన్ని మనసారా చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే బస చేసి స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో కాటేజీలు, రూమ్‌లు, భవనాలు అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యాదాద్రికి క్షేత్రానికి వెళితే అక్కడే రెండు రోజులు ఉండి, స్వామివారి క్షేత్రాన్ని ప్రశాంతంగా వీక్షించాలన్న కోరిక భక్తులకు రాకమానదు. ఆరేళ్లుగా ప్రధాన స్తపతులు, వందలాది ఉప స్తపతులు, ఆర్ట్ డైరెక్టర్లు, వైటీడీఏ అధికారులు, ఆర్ఆండ్ బీ అధికారులు కఠోరంగా శ్రమించి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారు. పాంచరాత్రగమశాస్త్రంలో ఆలయ నిర్మాణ వైదృశ్యం, విమాన వైదృశ్యాలు, రాజులు, కాకతీయ ప్రభువులు, ఇక్షాకులు, పళ్లవులు, కుండిణులు, విష్ణుకుండిణులు వంటి శైలీల చర్రితకు ఒక దర్పణంగా వెయ్యేండ్లు గుర్తిండిపోయే విధంగా శిల్పాకళా వైదృశ్యంతో యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దారు.
ఈ ఏడాది మార్చి 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ఆలయం పునఃప్రారంభమైంది. ఆలయ పునఃప్రారంభంతో రోజురోజుకి భక్తుల తాకిడి పెరుగుతూ వస్తున్నది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా విడిది కోసం యాదాద్రి దేవస్థానం దాతల సహకారంతో సకల వసతులు కలిగిన కాటేజీలు, సదనాలు నిర్మించి అందుబాటులోకి తెచ్చింది.
లక్ష్మి సదనం, లక్ష్మీనరసింహ సదనం..
యాదాద్రి కొండకింద తులసీ కాటేజీ ప్రాంతంలో లక్ష్మి సదనం పేరుతో నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇందులో 94 రూంలు ఉన్నాయి. ఒక్కో రూంలో ప్రత్యేకంగా బాత్రూం, బెడ్, ప్యాన్‌ను, ప్రతి అంతస్తుకు వేడి నీటిని అందించేందుకు గీజర్‌ను ఏర్పాటు చేశారు. ఒక్క రూంకు అద్దె రోజుకు రూ.500. ఆ పక్కనే శ్రీలక్ష్మీ నరసింహ సదనం పేరుతో 76 గదులతో మరో నాలుగు అంతస్తుల భవానాన్ని అందుబాటులోకి తెచ్చారు. రూ.300 అద్దెతో ఒక్కో గదిలో ఐదుగురు ఉండేలా సౌకర్యాలు కల్పించారు.
త్వరలో అందుబాటులోకి మరో 242 రూములు..
తులసీ కాటేజీ ప్రాంతంలోనే దాతల సహకారంతో మరో ఆరు అంతస్తులతో సదనం నిర్మాణం పూర్తికాగా తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన రూంలను దాతలకు కేటాయించారు. 242 రూంలు నిర్మించిన సదనంకు ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా నామకరణం చేసి దసరాకు భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
భక్తుల విడిదికి వసతులు
గతంలో యాదాద్రి కొండపైన భక్తులకు విడిది కల్పించాం. స్థలాభావంతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అనంతరం భక్తులకు విడిది వసతులను కొండకిందికి తీసుకువచ్చాం. దాతల సహకారంతో కాటేజీలను అందుబాటులోకి తీసుకువచ్చాం. దసరాలోగా మరో 242 రూంలు అందుబాటులోకి తీసుకువస్తాం. వీటితో పాటు వైటీడీఏ ఆధ్వర్యంలో ప్రెసిడెన్సియల్ సూట్లను భక్తుల విడిదికి వినియోగిస్తున్నాం. దాతల సహకారంతో మరిన్ని భవనాలు నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం.
-ఎన్. గీత, ఈఓ, యాదాద్రి దేవస్థానం.
16 ఏసీ, నాన్ ఏసీ కాటేజీలు..
కొండకింద తులసీ కాటేజీ ప్రాంతంలో దాతల సాయంతో ఏసీ, నాన్ ఏసీ విభాగాల్లో 16 కాటేజీలు నిర్మించారు. ప్రహ్లాద నిలయం పేరుతో 5 నాన్ ఏసీ సూట్ రూముల్లో భక్తులు విడిది చేసుకునే వీలుంటుంది. ఇందులో ఒక్కో సూట్‌కు రోజుకు జీఎస్టీతో కలిపి రూ. 2 వేలు అద్దె ఉంటుంది. అదే అచ్యుత నిలయంలో 3 ఏసీ సూట్లు ఉన్నాయి. ఒక్కో సూట్‌కు రూ. జీఎస్టీతో పాటు రూ. 3 వేలు, శ్రీరాం సదనంలో 2 నాన్ ఏసీ సూట్లు ఉన్నాయి. ఇందులో రూ.1,500, రూ.2 వేలుగా అద్దె నిర్ణయించారు. ఒక్కో సూటులో 3 సోఫాలు, 2 బెడ్రూంలు, డైనింగ్ టేబుల్స్, దివాన్ మంచంతో పాటు 6 కుర్చీలు ఉన్నాయి. వీటితో పాటు వేడి నీటిని భక్తులకు అందించేందుకు గీజర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రూ.1,750తో మాదవ నిలయం, కేశవ నిలయం నాన్ ఏసీ సూట్ రూంలు, రెండు బ్రెడ్రూంలు, హాల్, కిచెన్ సౌకర్యంలో రూ.2,500తో క్యాప్స్ సదనంలో 2 సూట్ రూంలు, పాత ఈఓ కార్యాలయం వద్ద 2 సూట్ రూంలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సూట్ రూములో 12 మంది భక్తులు ఉండేలా నిర్మాణాలు జరిగాయి.