
ఎవరెన్ని నిధులు తెచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఉత్తమ్‌కు సవాల్
నేరేడుచర్ల/పాలకవీడు, జనవరి 11 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, ప్రతి ఒక్కరూ వాటిని చూసి కొనియాడుతున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రైతు బంధు సంబురాల్లో భాగంగా మంగళవారం నేరేడుచర్ల, పాలకవీడు మండలాల్లో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల మోముల్లో చిరునవ్వే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు బంధు తరహాలోనే త్వరలో సీఎం కేసీఆర్ దళిత బంధు కూడా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తారని చెప్పారు. కోటి ఎకరాల మాగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే దానిని అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనకుండా దొంగ నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయారని, ఉనికిని కాపాడుకోవడం కోసం బ్రోకర్లతో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎంపీ ఉత్తమకుమార్‌రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చారో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పేకాట క్లబ్‌లను ఏర్పాటు చేసి, ఇసుక మాఫీయాను ప్రోత్సహించింది మీరు కాదా అని ప్రశ్నించారు.
హుజూర్‌నగర్‌లోని పలు లిఫ్ట్‌లకు 20 ఏండ్లల్లో రూ.300 కోట్లు తెస్తే.. తాము ఆరు నెలల్లోనే రూ. 2వేల కోట్లు తీసుకొచ్చామని తెలిపారు. మూసీనదిపై రూ.27 కోట్లతో చెక్ డ్యామ్‌లు నిర్మించామన్నారు. కనీసం మినరల్ ఫండ్ ఉందనే సంగతే మీకు తెలియదని, వాటిని నేడు నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అంతకు ముందు నేరేడుచర్ల మార్కెట్ యార్డులో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చక్కెర పొంగలిని తయారీ చేశారు. కార్యక్రమంలో నేరేడుచర్ల, పాలకవీడు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు అరిబండి సురేశ్‌బాబు, కిష్టిపాటి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, హుజూర్నగర్, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్లు కడియం వెంకట్‌రెడ్డి, యశోదారాములు, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, డీసీసీబీ డెరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు మలిమంచి దర్గారావు, చిల్లేపల్లి, పెంచికల్‌దిన్నె, పాలకవీడు పీఏసీఎస్ చైర్మన్లు అనంతు శ్రీనివాస్, శ్రీకాంత్, సత్యనారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుర్రం మార్కండేయ, టీఆర్ఎస్ మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు లింగయ్య, రవి, చిత్తలూరి సైదులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.