ప్రకృతి ప్రసాదమైన నీరా వేదామృతమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి విసరనోళ్ల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆల్కహాల్ ప్రభావం ఏమాత్రమూ ఉండని నీరాలో సహజసిద్ధ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8కోట్లతో భువనగిరి మండలం నందనంలో ఏర్పాటుచేస్తున్న నీరా కేంద్రానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో నీరా కేంద్రం పనులను పూర్తి చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామన్నారు. నీరా సేకరణకు జిల్లాకు 4 కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో వృత్తులకు ఊపిరిలూదిన ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. రియల్ఎస్టేట్ పేరుతో తాటి, ఈత చెట్లను ఎవరైనా తొలగించాలని చూస్తే ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హరితహారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ప్రభుత్వ స్థలాలు, సొసైటీ స్థలాల్లో విరివిగా తాటి, ఈత మొక్కలను నాటాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్/ భువనగిరి అర్బన్ ,జూలై 29 : ప్రకృతి ప్రసాదమైన నీరా వేదామృతమని రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రూ.8 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేంద్రం పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అన్ని వస్తువులు కల్తీ జరుగుతున్నాయని, ప్రకృతి ప్రసాదించిన నీరాలో కల్తీకి ఆస్కారం లేదన్నారు. నీరా కేంద్రం ఏర్పాటుతో గీత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమ కోసం చెట్టు పన్నును పూర్తిగా రద్దు చేసి వారికి ఆర్థ్ధిక భరోసాను కల్పించిందన్నారు. ప్రమాదవశాత్తు వృత్తిలో మరణిస్తే అందించే ఎక్స్‌గ్రేషియాను రూ. 5 లక్షలు చేసిందని గుర్తు చేశారు. గీత కార్మికుల ఎదుగుదలను ఓర్వలేకనే ఉమ్మడి రాష్ట్రంలోని సమైక్య పాలకులు విషం కక్కారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో కులవృత్తులకు ఊపిరిపోయడంతో పాటుగా గీత వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిదన్నారు. హరితహారం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని, ప్రభుత్వ స్థలాలు, సొసైటీ స్థలాల్లో విరివిగా తాటి, ఈత మొక్కలను నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. నీరా కేంద్రం పనులను త్వరగా పూర్తి చేసి ఈప్రాంత ప్రజలకు, యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తామన్నారు.
12న గౌడ్ ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన
ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడ జాతి అభ్యున్నతిలో భాగంగా హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేసిందన్నారు. ఆగస్టు -12న గౌడ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్యక్రమంలో గీత కార్మికులు భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, డేవిడ్ రవికాంత్, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్ దత్తరాజ్‌గౌడ్, చంద్రయ్య, శంభూప్రసాద్, సూపరింటెండెంట్లు రవీందర్రావు, సత్యనారాయణ, అరుణ్‌కుమార్, నవీన్‌కుమార్,వివిధ గౌడ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్‌గౌడ్, బాల్‌రాజ్‌గౌడ్, మాజీ సర్పంచ్ నాగెల్లి మాధవీ సత్యనారాయణగౌడ్, అంబాల నారాయణగౌడ్, రాజేంద్ర ప్రసాద్‌గౌడ్, చింతల మల్లేశం, అయిలి వెంకన్న, ఎంవీ. రమణ, కేఎల్ఎన్ ప్రసాద్, రాజు గౌడ్, మద్దెల రమేశ్, పాల్గొన్నారు.