‘తెలంగాణ రాష్ట్రం సాధించడం వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏంటో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింది రైతులను అడిగితే చెప్తారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అన్నవాళ్లకు నాగార్జున సాగర్ ఆయకట్టుకు వరుసగా 15వసారి నీళ్లివ్వడమే సమాధానం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు ఒక్క పంటకు కూడా సరిగ్గా నీరు అందించలేకపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పంటలకు నీళ్లిస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వానకాలం పంటల సాగు కోసం నాగార్జునసాగర్ హిల్‌కాలనీ పొట్టిచెల్మ వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి గురువారం ఉదయం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు.
అంతకుముందు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, శానంపూడి సైదిరెడి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్, ఎన్నెస్పీ అధికారులతో కలిసి కృష్ణమ్మకు పుసుపు, కుంకుమ, చీరెతో వాయినం సమర్పించి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా జలాల వినియోగంలో మన వాటాను నిక్కచ్చిగా తీసుకుంటూ, రైతులు కోరిన సమయంలో పంటలకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో నాణ్యమైన వాటా కోసం నాడు ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో ఎక్కడి నుంచైతే పోరాటం చేపట్టామో, అక్కడి నుంచే మన రైతులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లను విడుదల చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సాగర్ నియోజకవర్గంలోని 96 మంది లబ్ధిదారులకు హాలియాలో దళిత బంధు యూనిట్లను మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు.
నందికొండ : స్వరాష్ట్రంలో సాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు నీళ్లిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పొట్టిచెలిమ సమీపంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, ఎన్ఎస్పీ సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్ఈ ధర్మానాయక్‌తో కలిసి కృష్ణమ్మకు పూజలు చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 15వ సారి ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
గత పాలకుల హయాంలో ఎడమ కాల్వ ఆయకట్టుకు ఒక్క పంటకు కూడా సరిగా నీటిని అందించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని తెలుసుకోవాలంటే ఎడమకాల్వ కింద రైతులను అడిగితే తెలుస్తుందన్నారు. స్వరాష్ట్రంలో జూలైలోనే నీటి విడుదల చేయడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాను సారం 6.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళికలు చేపట్టామన్నారు. వరద కాల్వను పూర్తి చేసుకొని 80 వేల ఎకరాలకు నీటిని అందిస్తున్నామని, చరిత్రలో ఎన్నడూ నీరు అందని భూములకు కూడా ఎస్ఎల్బీసీ ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు.
నీటిని సద్వినియోగం చేసుకుంటూ వరితోపాటు ఇతర పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయకట్టుకు ముందస్తుగా నీటి విడుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్పీ ఎస్ఈ ధర్మనాయక్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశామన్నారు. గతంలో అనుసరించిన ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మంచి ఫలితాలు వస్తున్నందున అదే పద్ధతిలో నీటి విడుదల చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ కర్న అనూషాశరత్రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్, ఎంపీపీ అనూరాధాసుందర్రెడ్డి, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, నిమ్మల ఇందిరాగౌడ్, మంగ్తానాయక్, నాగశిరీషామోహన్నాయక్, నాయకులు నిమ్మల కొండయ్య, అంజయ్య, గుంటక వెంకట్‌రెడ్డి, అంకటి వెంకటరమణ, గజ్జెల లింగారెడ్డి, ఆర్డీఓ రోహిత్‌సింగ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాసీల్దార్ సైదులుగౌడ్, మున్సిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.