సూర్యాపేట, జూలై 28 (నమస్తే తెలంగాణ) : వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. మల్టీ పర్సస్ వర్కర్ నుంచి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ఇండ్లు, పరిసరాలతో పాటు మొత్తం గ్రామంలో నీళ్లు నిల్వకుండా చేయడం, దోమల నివారణకు ఆయిల్ బాల్స్, గంబూషియా చేపలు వేయడం, తాగునీటి ట్యాంకులను పరిశుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు.
ఈ నెల 24న ప్రారంభమైన ప్రత్యేక డ్రైవ్ ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రతి నెలా కోట్లాది రూపాయలు కేటాయిస్తూ చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ బాగుపడుతున్నాయి. జిల్లాలోని గ్రామాల్లో దాదాపు 90 శాతం సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించగా పాత ఇళ్లను తొలగించడంతో పాటు పారిశుధ్య పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ మొదలు అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ అంటువ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు..
ప్రతి ఉదయం 6 గంటలకే పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభం అవుతూ ఎక్కడ నీటి నిల్వలు ఉన్నా మట్టితో పూడ్చడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం, డీసిల్టింగ్, రోడ్లు, వీధులు ఊడ్చడం, ఇనిస్టిట్యూషన్లు క్లీన్ చేయడం, వాటర్ ట్యాంక్లు శుభ్రపరుచడం, వీధులు, మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రెయింగ్తో పాటు నీటి గుంటల్లో ఆయిల్ బాల్స్, గంబూషియా చేపలు వేయడం చేస్తున్నారు. డెంగీని అరికట్టే విధంగా ఖాళీ డబ్బాలు, టైర్లు తదితరాలను తొలగిస్తున్నారు.
ప్రజలు సహకరించాలి
గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇండ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పారిశుధ్య సిబ్బందికి సహకరించాలి. ఎక్కడ గుంటలు ఉన్నా, నీళ్లు నిలిచినా సమాచారం ఇస్తే పరిష్కరిస్తాం. వానకాలం నేపథ్యంలో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా దోమలు, బ్యాక్టీరియా, క్రిమి కీటకాల నిర్మూలన కోసం ఆగస్టు 2 నాటికి ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి.
– యాదయ్య, సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి