యాదాద్రి, జూలై 28 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో నేటి నుంచి శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 27వరకు వివిధ కార్యక్రమాలు జరుపనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులందరికీ చేరువ కావాలనే..
యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం లక్ష్మీ అమ్మవారు భక్తులందరికీ చేరువ కావాలని, అభయం ఇవ్వాలన్న సంకల్పంతో కోటికుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టామని ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. భక్తజన మహిళా సౌభాగ్యం, లోక కల్యాణం, విశ్వశాంత్యార్థం, క్షేత్ర అభివృద్ధి, మహామంత్ర శక్తి సమర్పణం, యంత్రశక్తి ఉద్దీపనలు అనుసరించి 30 రోజులపాటు కుంకుమార్చన నిర్వహించనునన్నట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు చెప్పారు. కోటికుంకుమార్చనలో భక్తులకు అభయ వరప్రదానం జరుగుతుందని, ప్రపంచ మహిళామణుల సౌభాగ్యమంతా స్థిరీకరణ జరిగి రుణ బాధలు తొలగిపోతాయని అన్నారు. శ్రావణమాసం అమ్మవారికి అభీష్టం కావడంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని దీక్షితులైన అర్చకవర్యులు నియమనిష్టలతో చేపట్టనున్నారని, కోటి కుంకుమార్చనతో మంత్ర, యంత్ర, తంత్ర శక్తి పెరిగి త్రిశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారికి అత్యద్భుతమైన మహత్యం ఆపాదించబడుతుందని వివరించారు.
1,400 మంది దంపతుల పేరిట సంకల్పం
కోటి కుంకుమార్చనలో పాల్గొనే దంపతులకు రూ. 2,000 ప్రవేశ రుసుం ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్ర నామాలు పేరిట సంకల్పం చేస్తారు. ఇలా 30 రోజులపాటు సంకల్పం నిర్వహిస్తారు. పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం, లక్ష్మి అమ్మవారి కుంకుమ ప్రసాదం అందజేస్తారు. వీటితోపాటు స్వయంభూ నరసింహ స్వామి ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఇప్పటివరకు సుమారు 1,400 మంది దంపతులు కుంకుమార్చనకు బుకింగ్ చేసుకున్నారు.
ఏర్పాట్లు పూర్తి
కోటి కుంకుమార్చనకు ప్రాకార మండపంలో విద్యుద్దీపాలు, కొబ్బరిమట్టలు, అరటి ఆకులతో అలంకరించారు. భక్తులు కూర్చునే విధంగా ఎర్ర తివాచీ పరిచారు. సంకల్పం వినిపించే విధంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మండపంలో లక్ష్మి అమ్మవారి ప్రతిమను వేంచేపు చేశారు. కోటి కుంకుమార్చనకు రావాలని జిల్లా మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆలయ ఈఓ ఎన్. గీత ప్రత్యేకంగా ఆహ్వానించారు. మొదటి రోజు కలెక్టర్ పమేలా సత్పతి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ పాల్గొననున్నారు.
30 మంది రుత్వికులతో..
శుక్రవారం నుంచి ఆగస్టు నెల శ్రావణ బహుళ అమావాస్య 27వ తేదీ వరకు శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు విష్వక్సేనారాధన, స్వస్తివాచనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ మహాకార్యంలో 30 మంది రుత్వికులు, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు పాల్గొని రోజుకు అమ్మవారి నామాన్ని 3.60 లక్షల సార్లు జపిస్తారు. ఇలా 30 రోజుల వరకు ఒక కోటి 8లక్షల నామస్మరణ పూర్తి చేస్తారు.