
చందంపేట మండల ప్రజల మన్ననలు పొందుతున్న వైద్యులు ధనలక్ష్మి, కృష్ణ
చందంపేట, జనవరి 10 : ఇద్దరూ గిరిజన బిడ్డలు కష్టపడి ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఒక్కరు చందంపేట మండలంలోని మారుమూల గ్రామంలో పశు వైద్యాధికారిగా, మరొకరు ప్రభుత్వ ప్రజా వైద్యాధికారిగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాట్రావత్ ధనలక్ష్మి చందంపేట మండల పశువైద్యాధికారి. ఆమె భర్త కృష్ణ దేవరకొండ ప్రభుత్వ దవాఖానలో వైద్యాధికారి. ధనలక్ష్మి వృత్తి రీత్యా సిబ్బందితో కలిసి గ్రామాల్లో ఎంతదూరమైన పర్యటిస్తూ మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల అమలులో దిట్ట
మూగ జీవాల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలులో ఆమె మంచి పేరు సంపాదించారు. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తారు. 2020 సంవత్సర పశుగణన ప్రకారం చందంపేట మండలంలో 28 గ్రామ పంచాయతీలు 60 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో 20,800 ఆవులు, 4,700 బర్రెలు, 30,800 గొర్రెలు, 16,560 మేకలు, 16,500 కోళ్లు , 63 పందులు ఉన్నాయి. నట్టల నివారణ మందు పంపిణీలో భాగంగా 5,900 గొర్రెలకు మందులు తాగించారు. 4,600 పశువులకు చికిత్స అందించి 44 వేల సీజనల్ వ్యాధుల టీకాలు వేశారు. 184 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించారు. ప్రతి వారం ఓ గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించి మూగజీవాలకు వచ్చే రోగాలపై అవగాహన కల్పిస్తున్నారు.