‘మీ పాలన బాగుందయ్యా.. జనమంత అనుకుంటున్నరు. మెచ్చుకుంటున్నరు. నెహ్రూ పరిపాలన గూడ ఇట్ల లేకుండే. ఎన్నడూ ఇంత అభివృద్ధిని కానలేదు’ అంటూ సూర్యాపేటకు చెందిన ఓ వయో వృద్ధుడు సీఎం కేసీఆర్ సర్కారుకు కితాబునిచ్చాడు. నియ్యత్ గల ప్రభుత్వానికి నిండు దీవెన అందించాడు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శుక్రవారం సూర్యాపేట పట్టణంలో పర్యటిస్తున్న సమయంలో 23వ వార్డులో 86 ఏండ్ల కామల్ల వెంకటయ్య తారసపడ్డాడు. మంత్రి జగదీశ్‌రెడ్డి పలుకరించగా, సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేశాడు. అప్పటికి-ఇప్పటికి ఎంత మారిందో అంటూ పాత రోజులను గుర్తుచేసుకున్నాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి పేపర్ వేసేవాడినని, ప్రజాప్రతినిధుల మొహాలు పేపర్లలో మాత్రమే కనిపించేవని, ఇప్పుడు నాయకుడిని, అభివృద్ధిని నేరుగా చూస్తున్నారని పేర్కొన్నాడు. వెంకటయ్య మొదటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ న్యూస్‌పేపర్లు వేసేవాడు.
పత్రికల్లో వచ్చిన వార్తలను స్థానికులతో చర్చిస్తుండడం అలవాటు. చుట్టుపక్కల వాళ్లు ఆయన్ని పేపర్ వెంకటయ్య అనే పిలుస్తుంటారు.
– సూర్యాపేట టౌన్, జూలై 15