
మునుగోడు, జనవరి 4: విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్నారు మునుగోడు తాసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్. సర్కారు జాగలను ఆక్రమణ దారుల నుంచి విడిపించే తాసీల్దార్‌గా రెవెన్యూశాఖలో ఆయనకు మంచి పేరుంది. భూ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తుండడంతో రైతుల మన్ననలు పొందుతున్నారు.
పట్టువదలని విక్రమార్కుడు..
మునుగోడులో మెగా నర్సరీ ఏర్పాటుకు ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని గతేడాది కలెక్టర్ నుంచి రెవెన్యూశాఖకు ఆదేశాలు అందాయి. అంత ప్రభుత్వ భూమి ఒకేచోట దొరకడం అసాధ్యమని సిబ్బంది భావించారు. కానీ తాసీల్దార్ లక్ష్మీదేవిగూడెంలోని సర్వేనంబర్ 10లో పట్టువదలని విక్రమార్కుడిలా పది రోజుల పాటు సర్వే నిర్వహించి 30 ఏండ్లుగా ఆక్రమణదారుల చెరలో ఉన్న సర్కారు జాగలను విడిపించి మెగా నర్సరీకి కేటాయించారు. అదేవిధంగా కొరటికల్‌లోని సర్వే నంబర్ 523లో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించి బృహత్ పల్లె ప్రకృతి వనానికి అప్పగించారు. మునుగోడులోని సర్వే నంబర్ 10లో 5.24 ఎకరాల సర్కారు జాగను విడిపించి హద్దులు నాటించి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.
సేవా కార్యక్రమాల్లోనూ…
హోమియో మెడికల్ సైన్స్‌లో సీటు సాధించిన ఇప్పర్తికి చెందిన దోటి శ్రీలతకు తాసీల్దార్ రూ.50 వేలు అందజేసి చేయూతనిచ్చారు. తల్లిదండ్రులు లేని ఆ విద్యార్థిని వైద్య విద్యను అభ్యసించేందుకు తోడ్పాటు నందించారు. మండలంలోని చొల్లేడులో తల్లిదండ్రులను కోల్పోయిన వందన అనే బాలికకు రూ.10 వేలు సాయం చేశారు. కరోనా సంక్షోభంలో పేదలను ఆదుకునేందుకు హెల్పింగ్ హ్యాండ్స్‌కు రూ.50 వేలు అందజేశారు.
భూ సమస్యలు తలెత్తకుండా చర్యలు
సర్కారు జాగలు ఆక్రమణకు గురికాకుండా చూడ డంతాసీల్దార్గా నా ప్రధాన కర్తవ్యం. విధి నిర్వహణలో ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా స్వీకరిస్తా.
-జక్కర్తి శ్రీనివాస్, తాసీల్దార్, మునుగోడు