నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్లో తొలిసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా అంతటా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేని వర్షం పడింది. పలు చోట్ల భారీగా వర్షపాతం నమోదైంది. అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలుచోట్ల పంటలు నీటమునిగాయి. జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగింది. వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. నల్లగొండ జిల్లాలో 38 మిల్లీమీటర్లు, సూర్యాపేటలో 68.8, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆత్మకూర్(ఎస్)లో 190.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నేడు, రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మూసీ ప్రాజెక్టుకు వరద పెరుగడంతో శుక్రవారం ఒక అడుగు ఎత్తి మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. నల్లగొండ పట్టణంలోని పద్మానగర్‌లో ఇంటిగోడ కూలడంతో నిద్రలోనే తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై 8 (నమస్తే తెలంగాణ) : జూన్‌లో వానలు అంతంతమాత్రమే కురువగా.. ఈ నెలలో సమృద్ధిగా పడుతున్నాయి. ప్రస్తుతం పడుతున్న వర్షాలతో పంటల సాగుకు మంచి సానుకూలత కలుగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి మొదలైన వర్షం శుక్రవారం రాత్రి వరకు వదలకుండా కురుస్తూనే ఉంది. రాత్రింబవళ్లు విడవకుండా వర్షం పడుతుండడంతో ప్రజా జీవనానికి అంతరాయం ఏర్పడింది. నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం 38మీల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకిరేకల్ మండలంలో 93.4మి.మీ., ఆ తర్వాత కేతేపల్లిలో 76.9, కట్టంగూర్‌లో 76.4, శాలిగౌరారంలో 74, జిల్లా కేంద్రంలో 71.3, మాడ్గులపల్లిలో 69.5, తిప్పర్తిలో 68.1, మునుగోడులో 53.7, డిండిలో 48.3మి.మీ. వర్షం పడింది. అతి తక్కువగా తిరుమలగిరి సాగర్‌లో 5మిల్టీమీటర్లు మాత్రమే నమోదైంది. మిగిలిన మండలాల్లో 9.8 మిల్టీమీటర్లకు పైనే పడింది. జిల్లాలో జూన్ 1నుంచి శుక్రవారం నాటికి సాధారణ వర్షపాతం 119.9 మిల్లీమీటర్లు కురువాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 190.7మి.మీ. పడింది. 59శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే పానగల్ బైపాస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు కొంత మేర అంతరాయం కలిగింది.
చెరువులు, కుంటల్లోకి వరద..
నల్లగొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నది. శాలిగౌరారం మండలంలోని రామాంజపురం పోతరాజుకుంట అలుగు పోస్తుండగా, నకిరేకల్‌లోని పెద్ద చెరువు నిండుకుండను తలపిస్తున్నది. వర్షాలు ఇలాగే కురిస్తే ఒకటి, రెండు రోజుల్లో మరికొన్ని చెరువులు మత్తడి దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంటల సాగుకు, ఇప్పటికే సాగు చేసిన పంటల ఎదుగుదలకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగకరమని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు మందకొడిగా సాగిన పంటల సాగు ఊపందుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది.
యాదాద్రి జిల్లాలో 17.3 మిల్లీమీటర్లు..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పోలిస్తే యాదాద్రి భువనగిరిలో వర్షం తక్కువగానే కురిసింది. ఇక్కడ సగటు వర్షపాతం 17.3మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలోని 17 మండలాల్లో వర్షం కురువగా కొన్నిచోట్ల మాత్రమే భారీ వర్షం పడింది. గుండాలలో అత్యధికంగా 46.8మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. ఆలేరులో 37.2మి.మీ., మోత్కూరులో 35.4, నారాయణపురంలో 23.2, యాదగిరిగుట్ట మండలంలో 20.8మి.మీ. వర్షం కురిసింది. అతి తక్కువగా బీబీనగర్ మండలంలో 1.2, బొమ్మలరామారంలో 2.2మి.మీ. కురువగా.. మిగతా మండలాల్లో 5మిల్లీమీటర్లకు పైనే నమోదైంది. ఇక్కడా ఈ సీజన్లో 51శాతం అదనంగా వర్షం కురిసినట్లు జిల్లా ప్రణాళిక విభాగం వెల్లడించింది. జూన్ 1నుంచి శుక్రవారం వరకు సగటు సాధారణ వర్షపాతం 136.2మి.మీ. కాగా.. ఇప్పటివరకు 205.3మి.మీ. వర్షపాతం నమోదైంది.
సూర్యాపేట జిల్లాలో అత్యధికం 19ం మిల్లీమీటర్లు..
సూర్యాపేట, జూలై 8 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రోజంతా వర్షం పడింది. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత జడివాన కురిసింది. జిల్లాలో అత్యధికంగా ఆత్మకూర్.ఎస్‌లో 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుంగతుర్తి, నడిగూడెం, మోతె, మద్దిరాల, నాగారం, నూతనకల్ మండలాల్లో 9 నుంచి 14 సెంటీమీటర్లు కురిసింది. జిల్లాలో సగటు వర్షపాతం 6.8గా నమోదైంది. జిల్లాలో 1071 చెరువులకుగాను 20 పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. 169 చెరువులు వంద శాతం నిండి ఉన్నాయి. అలాగే 462 చెరువులు 50 శాతం నిండగా, మిగిలిన చెరువుల్లో 25 శాతానికిపైనే నీరు చేరింది. జూన్ మాసంలో సరిపడా వర్షపాతం నమోదు కాకపోయినా.. ఈ ఒక్క రోజులోనే కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం పట్ల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట రూరల్, జూలై 8 : ఎగువన కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో శుక్రవారం మూడు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల్లో వరద పెరుగడంతో అప్రమత్తమైన అధికారులు ఒక్కో గేటును ఫీటు మేర ఎత్తి 1800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 3500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 640.95 (4.46టీఎంసీలు) అడుగులకుగాను ప్రస్తుతం 640.75 (3.42టీఎంసీలు) అడుగులు ఉన్నట్లు తెలిపారు.