చిట్యాల, జూలై 7 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా చిట్యాల పట్టణంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో రూ.1.30 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని 29 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. స్థానికుల సహకారంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా ఉపాధ్యాయులు చూసుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.
పాఠశాలలకు కావాల్సిన సీసీ కెమెరాలను వారం రోజుల్లో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తాసీల్దార్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాందుర్గారెడ్డి, ఎంఈఓ నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, విద్యా కమిటీ చైర్మన్ పోలేపల్లి సత్యనారాయణ, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, పందిరి గీత, రెముడాల లింగస్వామి, జడల పూలమ్మ, టీఆర్ఎస్ నాయకులు మెండె సైదులు, పొన్నం లక్ష్మయ్య, దాసరి నర్సింహ పాల్గొన్నారు.