నీలగిరి, జూలై 7 : స్వరాష్ట్రం సిద్ధించాక జైళ్లకు కొత్త శోభ వచ్చిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జైళ్ల శాఖలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎన్.మురళీబాబు అన్నారు. గురువారం జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ సెంటర్(ఓపెన్ జిమ్), చిల్ట్రన్స్ పార్కును ఆయన ప్రారంభించారు. అంతకుముందు జైలులోని ఖైదీలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైదీలలో సప్రవర్తన తీసుకొచ్చేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
జైళ్ల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రెండు పెట్రోల్ బంక్‌లు నిర్వహించడంతోపాటు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే నిరుపేదలకు ప్రతి రోజూ 150మందికి తగ్గకుండా రూ.10కే సంపూర్ణ భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీ, లయన్స్ క్లబ్ సహకారంతో జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మొక్కలు నాటారు. జైలు సూపరింటెండెంట్ ఎల్.దేవ్లా, ఎక్స్ అఫీషియో సభ్యులు మామిడి పద్మ, గుండెబోయిన లక్ష్మయ్య, అల్లావుద్దీన్, జైలర్లు జనార్దన్‌రెడ్డి, అనిల్, నరేశ్, రామలింగయ్య పాల్గొన్నారు.