రామగిరి, జూలై 29 : ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ కవితలు రాసిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య అని దాశరథి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. నల్లగొండలోని ఎంజీయూ కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్స్ తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘దాశరథి, సినారె జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దాశరథి, సినారె తరతరాలకు, మన తరానికి, నవతరాలకు స్ఫూర్తినీయులన్నారు. నేటితరం వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కవులు, కళాకారులు, రచయితలకు రావాల్సినంత గుర్తింపు రాలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే గుర్తించి లభించిందన్నారు. దాశరథి పేరుతో ప్రభుత్వం అవార్డులు అందించి ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సినారె సాహిత్యానికి ఎనలేని సేవలు చేశారని కొనిడాయారు. వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ దాశరథి, సినారె జీవితంలోని స్ఫూర్తినీయ అంశాలను వివరించారు.
విద్యార్థులు ఇలాంటి మహా కవులను స్ఫూర్తిగా తీసుకుని కవిత్వం, రచనలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. అదేవిధంగా తెలుగులో పరిశోధన వైపు ముందుకు సాగాలని కోరారు. అనంతరం కూరెళ్లకు నూతన వస్ర్తాలు అందించి వీసీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాటలు, కవితలను చదివి వినిపించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అరుణప్రియ అధ్యక్షతన జరిగిన నిర్వహించిన కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ అంజరెడ్డి, తెలుగు విభాగం అధ్యాపకులు జి.నర్సింహ, ఆనంద్, వివిధ విభాగాల అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్జీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సినారె జయంతి వేడుకలో దాశరథి అవార్డు గ్రహీత వేణుసంకోజును వైస్ ప్రిన్సిపాల్ మునీర్, తెలుగు విభాగం అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.