రామగిరి, జూన్ 21: నాణ్యమైన చదువే ధ్యేయంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. మన ఊరు-మన బడి, మన బస్తీ – మన బడిలో భాగంగా ఇప్పటికే మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించగా, ఆంగ్ల మాధ్యమం అమల్లో భాగంగా రెండు భాషల్లో ముద్రించిన పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 8వ తరగతి వరకు రెండు భాగాలుగా ముద్రించిన నాన్‌లాంగ్వేజ్ పుస్తకాలు జిల్లాబుక్ డిపోకు చేరుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3,121 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 20,11, 696 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 4,49,100 వచ్చేశాయి. కొత్త ముద్రణ నేపథ్యంలో మిగిలినవి విడుతల వారీగా రానున్నాయి. ఇప్పటికే వచ్చిన పుస్తకాలను ఆయా మండల కేంద్రాల్లోని ఎంఈఓ కార్యాలయాలకు చర్యలు తీసుకుంటున్నారు. పాఠ్యపుస్తకాలు పక్క దారి పట్టకుండా వాటిపై బార్ కోడ్‌తోపాటు క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. యూడైస్‌లోని విద్యార్థుల సంఖ్యకనుగుణంగా నంబరింగ్ కూడా వేశారు. ఆ నంబర్ ప్రకారమే ప్రతి విద్యార్థికీ పుస్తకాలు అందనున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో 3,121 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటితో పాటు గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. యూడైస్ ప్రకారం ఆయా పాఠశాలల్లో 4,23,982 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నది.
అందుకు విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో సులభంగా చదువుకునేలా 1 నుంచి 8తరగతి వరకు కొత్త పాఠ్యపుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం రెండు భాషల్లో ముద్రించింది. జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులందరికీ చేరేలా వాటిని జిల్లా కేంద్రాల్లోని బుక్ డిపోలకు చేరవేస్తున్నది. పాఠ్యపుస్తకాలను డీఈఓల ఆదేశాలతో మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు తరలించనున్నారు.
3,121 ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,121 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో చదివే విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించి 20,11,696 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇప్పటి వరకు 4,49,100 పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రంలోని బుక్డిపోలకు చేరాయి. రోజూ దశాలవారీగా పుస్తకాలు వస్తున్నట్లు ఆయా బుక్డిపోల మేనేజర్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమం అమలు చేస్తుండడంతో కొత్తగా ద్విభాష (తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో) పాఠ్యపుస్తకాలను 1 నుంచి 8వ తరగతికి అందిస్తుండటం వల్ల పుస్తకాల రాక ఆలస్యమైనట్లు తెలుస్తున్నది.
రెండు భాగాలుగా ముద్రణ
ఈ విద్యాసంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంతో పాఠ్యపుస్తకాలను 1 నుంచి 8వ తరగతి వరకు ద్విభాష పద్ధతిలో ప్రభుత్వం ముద్రిస్తున్నది. దాంతో పుస్తకాల సైజ్ ఎక్కువ అవుతుండటంతో నాన్ లాంగ్వేజ్ (గణితం, సైన్స్, సోషల్) రెండు భాగాలు చేశారు. ప్రస్తుతం భాగం-1 పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. దసరా సెలవుల తర్వాత విద్యార్థులకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి భాగం -2 పాఠ్యపుస్తకాలు అందుతాయని అధికారులు తెలిపారు.
పుస్తకాలపై బార్కోడ్
ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా చూసేందుకు ప్రతి పుస్తకంపై ప్రత్యేక బార్‌కోడ్‌ను నమోదు చేశారు. అంతే కాకుండా ఆయా పుస్తకాలపై క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. ఆయా పాఠశాలల నుంచి సేకరించిన యూడైస్‌లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకంపై నంబరింగ్ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి కచ్చితంగా అతడి నంబర్‌తో కూడిన పుస్తకమే చేరుతుంది. దాంతో అక్రమాలకు చెక్ పడనున్నది. ఒక వేళ సదరు పాఠ్యపుస్తకాలు బహిరంగ మార్కెట్లో కనిపించినట్లయితే అందుకు సంబంధిత ఎంఈఓలే బాధ్యులవుతారు. ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు పక్కదారి పట్టకుండా చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే ప్రత్యేక సంఖ్య ఆధారంగా ఆయా మండలాలకు సరఫరా అవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు అందించే పుస్తకాలపై నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంటుంది.