నల్లగొండ ప్రతినిధి, జూన్ 21(నమస్తే తెలంగాణ) : నల్లగొండ రూపురేఖలు మార్చేలా సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారులన్నీ విస్తరిస్తున్నారు. హైదరాబాద్ రోడ్డు నుంచి నల్లగొండలోకి ప్రవేశించే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి పాతది కావడంతో రైల్వే అధికారులు దీని పునర్నిర్మాణానికి అంతే వెడల్పుతో చర్యలు చేపట్టారు. పెరుగుతున్న ట్రాఫిక్, పట్టణ అవసరాల దృష్ట్యా బ్రిడ్జిని విస్తరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రంగంలోకి దిగి బ్రిడ్జిని కూడా విస్తరించాలని రైల్వే అధికారులను కోరారు.
పట్టువిడవని ఎమ్మెల్యే కంచర్ల
అయినప్పటికీ రైల్వే అధికారులు కేవలం 5.5 మీటర్ల వెడల్పుతోనే దీనిని పునర్నిర్మించేందుకు సోమవారం రంగం సిద్ధం చేయగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకురాగా రైల్వే ఇంజినీర్లతో సమీక్షించి బ్రిడ్జి విస్తరణపై తగు సూచనలు చేశారు. దీంతో మంగళవారం గుంటూరు డివిజన్‌కు చెందిన రైల్వే ఉన్నతాధికారులు నల్లగొండలో పర్యటించారు. అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ శ్రీనివాస్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సుదర్శన్‌రెడ్డి, సెక్యూరిటీ కమిషనర్ సత్యహరిప్రసాద్ నల్లగొండకు వచ్చిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు.
బ్రిడ్జి విస్తరణపై సుధీర్ఘంగా చర్చించిన అనంతరం క్షేత్రస్థాయిలో ఇబ్బందులను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కంచర్ల, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డితో కలిసి రైల్వే అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. నూతనంగా విస్తరిస్తున్న ప్రధాన రహదారి వెడల్పు, బ్రిడ్జి వద్ద ఉన్న వెడల్పు, బ్రిడ్జి విస్తరణ అవశ్యకతను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు వివరించారు. పక్కనే పాలిటెక్నిక్ కళాశాల, అందులో నిర్మిస్తున్న ఐటీ హబ్, మునుగోడు బైపాస్ రోడ్డు ఇలా ట్రాఫిక్ పరంగా రానున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌శర్మ సమక్షంలోనూ సమావేశం జరిగింది.
డబుల్ వెంట్ బ్రిడ్జి నిర్మాణానికి ఓకే
ఇందులోనూ ఎమ్మెల్యే 11 మీటర్ల బ్రిడ్జిని నిర్మించాల్సిందేనని స్పష్టం చేయడంతో రైల్వే అధికారులు ఉన్నతాధికారులతో పరిస్థితిని వివరించగా సానుకూలంగా స్పందించక తప్పలేదు. చివరకు రెండు వైపులా 11 మీటర్ల చొప్పున డబుల్ వెంట్ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు ఓకే చెప్పినట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వెల్లడించారు. త్వరలోనే నిర్మాణ పనులు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే అండర్ బ్రిడ్జి పునర్నిర్మాణం, విస్తరణ కోసం ఆది నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తులు, ఉద్యోగులు, వాహన యజమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కంచర్లకు ధన్యవాదాలు తెలిపారు.