యాదాద్రి, జూన్ 21: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ మంగళవారం ఆకుపూజ నిర్వహించారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా క్యూ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఆలయంలోని హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. లలితాపారాయణం చేపట్టి, ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు.
వైభవంగా నిత్యారాధనలు
యాదాద్రి స్వయంభూ ప్రధానాలయంలో నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 3.30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు చేపట్టి, ఉదయం ఆరగింపు నిర్వహించారు. ఉదయం 5.15 నుంచి 6.15 గంటల వరకు స్వామివారికి నిజాభిషేకం కోలాహలంగా జరిపారు. అనంతరం శ్రీస్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు.
అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. నిత్యపూజల్లో భాగంగా ప్రధానాలయ ప్రాకారంలో శ్రీలక్ష్మీనరసింహుల నిత్యకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ప్రాకారంలో వెండి మొక్కు జోడు సేవోత్సవం, దర్బార్ సేవలు సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందజేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులచే జరుపబడే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండకింది పాత గోశాల వద్ద సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని, వ్రత మాచరించారు.
పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి.
హుండీ ఆదాయం రూ.67,13,089
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఏడు రోజుల హుండీ ఆదాయం రూ. 67 లక్షలు దాటిందని యాదాద్రి ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరితహోటల్లో హుండీలను లెక్కించామని, నగదు రూ.67,13,089 ఆదాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 58 గ్రాములు, మిశ్రమ వెండి కిలో 450 గ్రాములు వచ్చిందని తెలిపారు. దీంతోపాటు అమెరికాకు చెందిన 119 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 10 పౌండ్స్, యూరో కు చెందిన 5 యూరోస్, యూఏఈకి చెందిన 80 దిరామ్స్, సింగపూర్‌కు చెందిన 50 డాలర్లు స్వామివారికి సమకూరినట్లు ఈఓ తెలిపారు.