యాదగిరిగుట్ట రూరల్, జూన్ 21 ;జిల్లాలోని మోత్కూరు, చౌటుప్పల్ పట్టణాల్లో సోమవారం 8 ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఫిట్నెస్ చేయించుకున్న తరువాతే రోడ్ల మీదకి తీసుకురావాలని సూచిస్తున్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
70 బస్సులు మాత్రమే చెకింగ్‌కు..
జిల్లాలో 187 స్కూల్ బస్సులు ఉన్నాయి. వీటిలో 70 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చెక్ చే యించారు. ఇంకా వందకుపైగా బస్సులు చేయా ల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని ఎనిమిది బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్‌చేసి కేసు లు నమోదు చేశారు. నిర్ణీత గడువులోగా ఫిట్నెస్ పరీక్షలు జరిపించుకోకుండా బస్సులు నడిపితే జరిమానా విధిస్తారు. ఆ తరువాత కూడా ఫిట్నెస్ చేయించుకోకపోతే బస్సును సీజ్ చేస్తారు.
పాటించాల్సిన నిబంధనలు…
మోటరు వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, పన్ను చెల్లింపు రశీదు పొల్యూషన్, కంట్రోల్ సర్టిఫికెట్తో పాటు డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
డ్రైవర్ ఫొటోను తప్పనిసరిగా బస్సులో ఏర్పాటు చేయాలి. అద్దాలకు గ్రిల్స్ అమర్చాలి.
ప్రతి బస్సులో విద్యార్థుల అటెండెన్స్ ఉండాలి. ప్రతి నెలా ప్రిన్సిపాల్, తలిదండ్రుల కమిటీ బస్సులను తనిఖీ చేయాలి.
పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించరాదు.
బస్సులకు తప్పనిసరిగ్గా పసుపు రంగు వేయాలి. పాఠశాల పేరు, సెల్‌ఫోన్ నెంబర్, పూర్తి చిరునామా బస్సు ఎడమవైపు కనిపించేలా ఉండాలి.డ్రైవర్ మూడు నెలలకోసారి బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. బస్సు కిటికీలకు మధ్య రెండు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి.
తప్పనిసరిగా ఫిట్నెస్ చెక్ చేయించాలి
స్కూల్ బస్సు భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ను రోజూ తనిఖీ చేస్తున్నాం. లేనివాటిని సీజ్ చేస్తున్నాం. పాఠశాలల యాజమన్యాలు తప్పనిసరిగా ఫిట్నెస్ చెక్ చేయించాలి. లేకుంటే రోడ్లపైకి తీసుకురావద్దు.
– సురేందర్‌రెడ్డి, జిల్లా రవాణా శాఖాధికారి