సూర్యాపేట టౌన్, జూన్ 21 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడి కుటుంబానికి అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొన్నేళ్లుగా జ్యూస్ బండి నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో గత ఏడాది అనార్యోగం కారణంగా రెండు కాళ్లు కోల్పోయిన నజీర్‌పాషా అతని భార్య సాజితతో కలిసి మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బిజీగా ఉన్నప్పటికీ, వారు లోపలికి వచ్చే క్రమంలో పరిస్థితిని గమనించిన మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా వారి వద్దకు వెళ్లారు. జరిగిన సంఘటనతోపాటు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వెంటనే బాధితుడికి ట్రైసైకిల్, డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతోపాటు తక్షణమే ఆర్థికసాయం అందజేశారు. అలాగే ఆ కుటుంబానికి నిరంతర ఆదాయం కోసం ఏదైనా మార్గం చూపుతామని మంత్రి భరోసా ఇచ్చారు. సమస్యను విన్నవించుకునేందుకు వచ్చిన తమకు కొండంత అండగా నిలిచిన మంత్రి జగదీశ్‌రెడ్డికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
జయశంకర్ సార్‌కు ఘన నివాళి
దివంగత ఆచార్య జయశంకర్ సార్ రాష్ర్టానికి ఐకాన్ లాంటి వారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ 11 వ వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన రోజునే బలంగా వ్యతిరేకించిన యోధుడు జయశంకర్ సార్ అని ఆయన తెలిపారు. సహజ వనరులను సద్వినియోగపరుచుకుని ఎనిమిదేండ్ల పాలనలో యావత్ భారతదేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో నిలబెట్టారన్నారు. అద్భుతమైన విజన్ అంతకు మించి చక్కటి పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతోటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు.
ఇది ఎవరో చెబితే తెలిసింది కాదని ఎనిమిదేండ్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు స్వయాన కేంద్ర ప్రభుత్వమే కితాబునివ్వడం ఇందుకు అద్దం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి చెందిన గ్రామాల లిస్టులో 1 నుంచి 19 వరకు రాష్ట్ర పల్లెలు ఉండటం.. పట్టణాల వరుసలోనూ 1 నుంచి 10 వరకు ఉండడం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు తార్కాణంగా మంత్రి జగదీశ్ రెడ్డి అభివర్ణించారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్లు బాషా, జ్యోతి, శ్రీవిద్యాకరుణాకర్, బైరు వెంకన్న, జూలకంటి సుధాకర్ రెడ్డి, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, గుండపునేని కిరణ్ పాల్గొన్నారు.