రామగిరి, జూన్ 20 :మనస్సు, వాక్కు, కర్మలను నియంత్రించుకోవడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతను పొందేందుకు యోగా దోహద పడుతుంది. ప్రస్తుత ఆధునిక జీవన శైలి, ఒత్తిడి కారణంగా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. నిత్యం యోగా సాధన చేయడం ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో పుట్టిన యోగాను నేడు ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి.
యోగాలో ఉచిత శిక్షణ ఇస్తున్న శంకరయ్య
రామగిరి : నల్లగొండకు చెందిన మాదగోని శంకరయ్య 45 ఏండ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యోగాలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 1977లో మునుగోడు మండలం పలివెలలో 7వ తరగతి చదువుతున్న సమయంలో హిందీ ఉపాధ్యాయుడు పాండు రంగ య్య వద్ద యోగా నేర్చుకున్నారు. అప్పటి నుంచి తాను సాధన చేస్తూనే ఇతరులకు నేర్పిస్తున్నారు. శంకరయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోలీస్ శిక్షణాకేంద్రాలు, యూనివర్సిటీల్లో ఉచితంగా శిక్షణ నిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. మెడిటేషన్, యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ధ్యాన మండలి ద్వారా యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లా జైలులో ఖైదీల ప్రవర్తనలో మార్పుకోసం యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామాన్ని ఉచితంగా నేర్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాలలకు అవసరమైన యోగా మాడ్యుల్స్‌ను సైతం రాసి రాష్ట్ర విద్యా శిక్షణామండలికి అందజేశారు. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 2020 జనవరి, ఫిబ్రవరిలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన నిష్ఠలో యోగాపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ నిత్యం యోగా సాధన చేయడం వల్ల ఆరో గ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. గ్యాస్ట్రబుల్, మలబద్ధకం, గుండె సంబంధిత, ఊబకాయం వంటి వ్యాధులతో బాధపడే వారు నిపుణుల పర్యవేక్షణలో యోగా చేస్తే నయమవుతాయని పేర్కొన్నారు.
వందల మందికి శిక్షణ
రామగిరి : నల్లగొండలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొత్త రఘువీర్ 20 సంవత్సరాలుగా యోగాలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ‘జ్ఞాన యోగ పీఠం స్థాపించి పట్టణ వాసులతో పాటు తాను పని చేసే పాఠశాల విద్యార్థులకు సైతం యోగాసనాల్లో తర్ఫీదునిస్తున్నారు. ఈయన షట్క్రియల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియతో శరీరంలోని వివిధ భాగాలను చైతన్యం చేసే విధానాలు వివరిస్తున్నట్లు రఘువీర్ తెలిపారు. యోగా గురించి అందరికీ వివరించి దాని ప్రాముఖ్యతను తెలిసేలా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
రోజంగా ఉత్సాహంగా ఉంటుంది
రోజూ యోగా చేయడం వల్ల ఉత్సాహంగా ఉంటుంది. గతంలో నీరసం, అలసటతో పనిపై దృష్టిపెట్టలేక పోయేదానిని. యోగా తరగతులకు వెళ్తున్నప్పటి నుంచి ఎలాంటి నీరసం లేదు. బలానికి విటమిన్ ట్యాబ్లెట్స్ ఎలాగో.. మనలోని శక్తిని వెలికి తీసేందుకు యోగా అలా ఉపయోగపడుతున్నది. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగా చేయడం అవసరం.
– వాణి జ్యోత్స్న, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, సూర్యాపేట
యోగా గురువు కరుణాకర్
రామగిరి : చండూరు మండలంలోని కోటయ్యగూడేనికి చెందిన కరుణాకర్ 2009లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వెళ్లి స్వామీ రామ్‌దేవ్ మహరాజ్ వద్ద యోగాలో శిక్షణ పొందారు. తర్వాత నల్లగొండలోని ఆర్యసమాజంలో యోగా శిక్షణను ప్రారంభించి శిక్షణ ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలో వైదిక్ యోగ్ పీఠ్ ట్రస్ట్‌ను ప్రారంభించి పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికీ యోగా అవసరమని, దీని వల్ల ప్రాణశక్తి అధిక మొత్తంలో కణాలకు అందడం వల్ల శరీరంలోని అన్నిభాగాలు ఆరోగ్యంగా, పరిపుష్టిగా ఉంటాయని కరుణాకర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని సూచిస్తున్నారు.
14 ఏండ్లుగా యోగా నేర్పిస్తున్న పాపిరెడ్డి
బొడ్రాయిబజార్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన యోగా గురువు చాడ పాపిరెడ్డి 14 ఏండ్లుగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు. 2006లో సిద్ధరాజ్ తపోధన్ గిరిస్వామి వద్ద శిక్షణ పొందిన ఆయన 2008 నుంచి సూర్యాపేటలో యోగా శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. నామ మాత్రపు రుసుము తీసుకుంటూ వేల మందికి శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు ఆయన వద్ద శిక్షణకు వస్తుంటారు. యోగాను నిత్యం సాధన చేస్తే ఎలాంటి వైరస్‌నైనా తట్టుకునే శక్తి మనకు లభిస్తుందని చాడ పాపిరెడ్డి తెలిపారు. చాలా మంది షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు తమ కేంద్రానికి వచ్చి సంపూర్ణ ఆరోగ్యం పొందారన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా సాధన ఒక్కటే మార్గంమని పేర్కొన్నారు.
ఆసనాలవల్ల ఉపయోగాలు
పద్మాసనం వేయడం వల్ల కాళ్లు, తొడ కండరాలు, వెన్నెముక బలంగా అవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. వజ్రాసనం వల్ల ఉదర సంబంధిత సమస్యలు రావు. జీర్ణశక్తి పెరుగుతుంది. మోకాళ్ల సమస్యలు ఉంటే గురువు సూచనలతో చేయాలి. దీని వల్ల కాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మండూకాసనం వేయడం వల్ల కాళ్లు, మోకాళ్లు, తొండ కండరాలు, వెన్నెముక, వీపు కండరాలు చురుగ్గా మారి ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల్లో మలబద్ధకం పోతుంది. పశ్చిమోత్తాసనం వేయడం వల్ల మలబద్ధకం పోయి ఆకలి పెరుగుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్లు, కాళ్లు, చేతుల నొప్పులు తగ్గి శరీరం చురుగ్గా ఉంటుంది. శీర్షాషసనం వల్ల తలకు రక్త ప్రసరణ జరిగి వ్యాధులు రావు. కంటి సమస్యలు దూరమవుతాయి. మకరాసనం వేయడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రక్తపోటు తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. విపరీత నౌకాసనం వల్ల పిల్లల్లో నడుము, వీపు, మెడ నొప్పులు తగ్గడంతో పాటు మూత్ర పిండాలు, వెన్నెముక, ఉదర కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
గుండె సమస్యలకు చక్రాసనం
చక్రాసనం నిత్యం సాధన చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. నరాల బలహీనత, థైరాయిడ్ సమస్య, వెన్నుపూస, ఊపిరితిత్తులు, గర్భకోశ సమస్యలు తగ్గుతాయి. వృక్షాసనం వల్ల శరీర సౌష్టవంతోపాటు మానసిక ప్రశాంత కలుగుతుంది. మెదడు ఎంతో ఉత్తేజంగా పనిచేస్తుంది. రక్తప్రసరణ, ఏకాగ్రత పెరుగుతుంది. చిన్న పిల్లలు ఈ ఆసనం చేయడం వల్ల ఎత్తు పెరుగుతారు. యవ్వనశక్తి పెరుగుతుంది. సర్వాంగాసనం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. గొంతు నొప్పి, మలబద్ధకం సమస్యలు నివారిస్తుంది. ధనురాసనం వల్ల అధికంగా పెరిగిన పొట్ట తగ్గుతుంది. తొడల ప్రాంతంలోని కొవ్వు కరుగుతుంది. థైరాయిడ్ సమస్యను అధిగమించవచ్చు. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. భుజంగాసనం వల్ల పొట్ట, భుజాల వద్ద ఉన్న అదనపు కొవ్వు కరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగు పడడంతో పాటు కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు తొలగిపోతాయి. భూమనాసనం వల్ల వెన్నుపూస గట్టి పడుతుంది. లివర్ సమస్యలు దూరమవుతాయి. స్త్రీలల్లో రుతుక్రమ సమస్య తగ్గుతుంది. క్రమం తప్పకుండా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
ధ్యానం
దీనిని ఆత్మ సంయమ యోగమని అంటారు. బాహ్య అంశాలపై చలించకుండా ఉండటమే ధ్యానం. మనస్సును నిగ్రహం చేసి ఏకాగ్రతతో ఉఛ్వాస, నిశ్వాసలు చేస్తూ దీనిని ఆచరించాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక, మానసిక జీవితానికి ధ్యానం శ్రేష్టమైంది. ధ్యానంలో మూడు దశలుంటాయి. ధారణ, ధ్యానం, సమాధి. ధ్యానంలో కళ్లు తెరుచుకొని, కళ్లు మూసుకొని ధ్యానం చేయడం, భూమధ్యంగా, ఆత్మ యందు దృష్టిని కేంద్రీకరించి ధాన్యం చేస్తారు. ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఉంచాల్సి ఉంటుంది.
సూర్య నమస్కారం
ప్రాణాయామం సంయుక్త క్రియే సూర్య నమస్కారం. యోగా సాధనకు కావాల్సిన శారీరక సంసిద్ధతను సూర్య నమస్కారాలు కలిగిస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో వీటిని ఆచరిస్తారు. సూర్యుడికి ఎదురుగా నిలబడి మంత్రాన్ని జపిస్తూ సూర్య నమస్కారం చేయడం ముఖ్యం.
యోగాలోని ప్రధానాంశాలు
యోగాలో మూడు అంశాలు ముఖ్యమైనవి. అవి ప్రాణాయామం, సూర్యనమస్కారం, ధ్యానం. శరీరంలో అన్ని అవయవాలకు ప్రాణశక్తిని అందించే ప్రక్రియే ప్రాణాయామం. ఈ ఆసనం చేసేటప్పుడు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తాం. కాబట్టి శరీరంలోని అన్ని భాగాలు చైతన్యమవుతాయి. ప్రాణాయామం చేసే టప్పుడు స్థానం, కాలం, మితాహారం, నాడీశుద్ధి అనే అంశాలు పాటించాల్సి ఉంటుంది. పాణాయామాన్ని చేయడం వల్ల శరీరంలోని మనస్సు, ఇతర ఇంద్రియాల్లోని దోషాలు తొలగిపోయి నాడి శుద్ధిఅవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాలేయం, జీర్ణాశయం, చిన్న, పెద్ద పేగులు సమర్థవంతంగా పని చేస్తాయి. శరీరంలోని 72 వేల నాడులు శుద్ధి అవుతాయి. నరాల పటుత్వం పెరుగుతుంది. శరీరంలోని కొవ్వు కరిగుతుంది. ఊపిరితిత్తుల్లోకి నిండుగా గాలి పీల్చడం వల్ల కావల్సినంత ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్‌డై ఆక్సైడ్‌ను, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాం. ఫలితంగా రక్తం ద్వారా కణజాలానికి ఆక్సిజన్ చేరి శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
యోగాసనాలు
యోగాలో ఏడు రకాల ఆసనాలు ఉంటాయి. ఇందులో కూర్చొని చేసేవి 18 రకాల ఆసనాలుంటాయి. పడుకొని చేసేవి 12, బోర్ల పడుకొని చేసేవి 6, చేతులతో చేసేవి 5 రకాలు, మోకాళ్ల మీద చేసేవి 5, నిలబడి చేసేవి 10 రకాలు, తల ఆధారంగా చేసేవి 3 రకాలు ఉన్నాయి.
ప్రాచీన కాలం నుంచి
ప్రాచీన కాలంలో యోగులు ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించేందుకు యోగాను తమ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా చేసుకునేవారు. యోగాభ్యాసానికి శ్రద్ధ, సహనం అవసరమని గురువులు చెబుతుంటారు. యోగవిద్యకు ఆద్యుడు ఎవరనే విషయం తెలియక పోయినా.. ప్రపంచానికి యోగ విద్యను అందించింది పతంజలి మహర్షి యోగాకు ఆద్యుడిగా పిలుస్తారు. 2015లో ప్రపంచంలోని 174 దేశాలు యోగా దినోత్సవాన్ని పాటించగా, 2018లో 191 దేశాలు భాగస్వాములయ్యాయి.
ధ్యానం వల్ల లాభాలు
ధ్యానం వల్ల సాత్విక సంస్కారం వస్తుంది. భ్రమలు, భ్రాంతులు పోతాయి. ధ్యానస్థితిలో ఉండటం వల్ల కోరికలు సఫలమవుతాయి. సంకల్పాలు నెరవేరుతాయి. విజ్ఞాలు తొలగిపోతాయి. మానసిక జఢత్వం నశిస్తుంది. దూరదృష్టి, దూర శ్రవణం, సంకల్పశక్తి, వాక్కు, మనోబుద్ధి బలం పెరుగుతాయి. దయ, కరుణ, సంతోషం, స్నేహ బంధం కలుగుతాయి. సత్య శక్తి, వీర్యం, ప్రాణశక్తి చేకూరుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.