కూరగాయలు సాగు చేసే రైతులు బెండ వేసేందుకు ఇదే సరైన సమయం. జూన్, జూలైలో బెండను విత్తుకొని, సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు ఎరువుల యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. సాగునీటి లభ్యత, మురుగు నీటి పారుదల వంటివి సక్రమంగా ఉంటేనే నష్టం రాకుండా చూసుకోవచ్చని తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
బెండసాగు విధానం
బెండ సాగుకు జూన్, జూలై నెలలు అనుకూలం. రెండో పంటగా జనవరి, ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాలు అవసరం. బెండలో వివిధ రకాల విత్తనాలు ఉన్నా.. పర్భిని క్రాంతి, అర్కా అనామిక, అర్కా అభయ వంటి రకాలను విత్తుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ఈ పంట కాలవ్యవధి 85 నుంచి 90 రోజులు ఉంటుంది. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుంది.
విత్తే విధానం
బెండ సాగుకు నేలను నాలుగైదు సార్లు బాగా దున్నిన తర్వాత 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు ఏర్పాటు చేసి వాటిమీద 20 నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలను విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీరు పెట్టి తిరిగి నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత రెండో తడి అందించాలి. మొక్కలు వచ్చిన తర్వాత మంచి మొక్కలను ఉంచి మిగిలిన వాటిని తొలగించాలి.
ఎరువుల వాడకం
ఒకసారి దుక్కి దున్నిన తర్వాత రెండవ దుక్కిలో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి కలియ దున్నాలి. వీటితో పాటు 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాశ్, 48 కిలోల నత్రజని ఎరువులను మూడు సమభాగాలుగా చేసి మొదటి భాగాన్ని ఆఖరి దుక్కిలో రెండవ భాగాన్ని విత్తిన 30వ రోజున, 3వ దఫా ఎరువును 45వ రోజున వేయాలి.
సస్యరక్షణ చర్యలు
బెండచేలో మువ్వా, కాయతొలుచు పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. దీని నివారణకు కార్బరిల్ 3 గ్రాములు లేదా క్వినాల్ఫాస్, లేదా ప్రాఫెనోఫాస్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగుళ్ల నివారణ
బూడిద తెగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు డైనోకాప్ లేదా హెక్స్సా కొనజోల్ రెండు మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పల్లాకు తెగులు నివారణకు డైమిథోయేట్ రెండు మి.లీ. లేదా ఎసిఫెట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తన శుద్ధి చేయకుంటే ఎండుతెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెగులు వల్ల మొలక దశలో ఉండగానే మొక్కలు ఎండిపోయి చనిపోతాయి. దీని నివారణకు మొక్కల మొదళ్ల వద్ద కాపర్, ఆక్సిక్లోరైడ్ వంద కిలోల చొప్పున వేయాలి.
దీపపు పురుగుల నివారణ
దీపపు పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండి ఆకుల ఆడుగుభాగాన చేరి రసాన్ని పీల్చి పంటకు నష్టాన్ని కలుగజేస్తాయి. ఆకులు పైకి ముడుచుకుపోయి పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు మిథైల్ డెమటాన్ రెండు మిల్లీ లీటర్లు లేదా డైమిథోయేట్ రెండు మి.లీ. లేదా పిప్రానల్ రెండు మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి, తెల్లదోమ వంటి పురుగులు ఆశిస్తే ఇవే మందులను 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
యాజమాన్య పద్ధతులు పాటిస్తే లాభాలు
బెండసాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చు. జూన్, జూలై నెలల్లోనే విత్తనాలు విత్తాలి. రైతులు విత్తన ఎంపికలో వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి. బెండ సాగుకు పెట్టుబడి కూడ తక్కువే.
-వెంకటేశ్వర్లు, ఏఓ, తిరుమలగిరి.