నల్లగొండ ప్రతినిధి, జూన్ 20(నమస్తే తెలంగాణ) : రైల్వే అధికారులు పైస్థాయిలో చేసే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలతో సంబంధం లేకుండా ఉంటున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా అంతటా రైల్ ట్రాక్‌లపై ఉన్న గేట్లను తొలిగిస్తూ అక్కడ డ్యూటీలో ఉండే గేట్ కీపర్ల వ్యవస్థను రద్దు చేస్తూ అండర్ పాస్‌లు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ అండర్‌పాస్‌ల నిర్మాణంలోనే రైల్వే అధికారులు తీవ్ర అభాసుపాలయ్యారు. భూమికి సమాంతరంగా ఉన్న రైల్వే ట్రాక్‌ల కింద నుంచి నిర్మించిన అండర్‌పాస్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వస్తే కనీసం మూడు నాలుగు నెలలు అండర్పాసుల్లో నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. వీటిపై స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా రైల్వే అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు.
ఇక ఇదే తరహాలో నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి స్థానంలో సిమెంట్ బాక్స్‌లతో కూడిన బ్రిడ్జి నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఈ బ్రిడ్జి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నిర్మించడం లేదు. ఒక్కో వైపు కేవలం ఆరు మీటర్ల ఎత్తు, 5.5 మీటర్ల వెడల్పుతో నిర్మాణం తలపెట్టారు. కానీ మర్రిగూడ బైపాస్ రోడ్డు నుంచి జిల్లా కేంద్రంలోకి ప్రవేశించే అతి ముఖ్యమైన మార్గంలో ఉన్న ఈ బ్రిడ్జిని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో నల్లగొండలోని అన్ని ప్రధాన రహదారులు విశాలంగా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డును ప్రస్తుతం ఒక్కో వైపు 11 మీటర్ల వెడల్పు చొప్పున ఇరువైపులా విస్తరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రైల్వే బ్రిడ్జిని కూడా ఇదే తరహాలో విస్తరిస్తూ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ సహకారంతో రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొద్దిరోజుల కిందట జిల్లాలో పర్యటనకు వచ్చిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్‌ను మిర్యాలగూడలో కలిసి పరిస్థితిని వివరించారు. పెరిగిన రద్దీ, ట్రాఫిక్ అవసరాల రీత్యా రైల్వే బ్రిడ్జిని ఒక్కో వైపు 11 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని కోరారు. కానీ రైల్వే అధికారుల్లో మాత్రం స్పందన కరువైంది. యధావిధిగా తాము ముందే అనుకున్న విధంగా ఇరుకు బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం సన్నాహాలు చేస్తుండగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌తో కలిసి పరిశీలన..
రైల్వే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 5.5 మీటర్లతో బ్రిడ్జి నిర్మాణం తగదని స్పష్టం చేశారు. అప్పటివరకు పనులు నిలిపివేయాల్సిందేనని సూచించారు. ఇదే విషయమై కలెక్టర్ రాహుల్‌శర్మను కలిసి వివరించారు. దీంతో కలెక్టర్ బ్రిడ్జి నిర్మాణ స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి వెడల్పును టేపు వేసి కొలిచి, నూతనంగా విస్తరిస్తున్న రోడ్డు వెడల్పుతో పోల్చి చూశారు. నూతన రోడ్డులో సగమే బ్రిడ్జి వెడల్పు ఉంటే ప్రమాదాలకు అధిక ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. దీంతో కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్‌శర్మ రైల్వే ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. బ్రిడ్జి వెడల్పు విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు.
సమస్య పరిష్కారం దిశగా దృష్టి సారించాలని సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కనీసం 100 ఫీట్ల వెడల్పుతో విస్తరణ జరుగుతుంటే పట్టణంలోకి ప్రవేశించే రైల్వే అండర్ బ్రిడ్జిని ఇరుకుగా నిర్మించడం తగదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. బ్రిడ్జీని ఒక్కోవైపు కనీసం 9 మీటర్ల వెడల్పుతోనైనా నిర్మించాలని, అప్పటివరకు పనులు నిలిపివేయాలని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీం పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.