నల్లగొండ ప్రతినిధి, జూన్18(నమస్తే తెలంగాణ) : పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛ వాతావరణం కల్పించడంతో పాటు పచ్చదనం పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన పల్లె ప్రగతి 16 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగింది. పారిశుధ్య నిర్వహణకు, రోడ్లు, ప్రభుత్వ భవనాల శుభ్రతకు పెద్దపీట వేస్తూ పల్లె ప్రగతి నిర్వహించారు. టార్గెట్ పెట్టుకొని కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలో 2,520 కిలోమీటర్ల మేర రోడ్లకు గానూ 3,213 కిలోమీటర్ల రోడ్లను శుభ్రపరిచారు. సూర్యాపేట జిల్లాలో 1,956కి.మీకు గానూ 2,091, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,557 గానూ 3,469 కిలోమీటర్ల రోడ్లను శుభ్రం చేసి లక్ష్యాన్ని అధిగమించారు.
మురుగు కాల్వలను కూడా ప్రత్యేకంగా క్లీన్ చేశారు. నల్లగొండ జిల్లాలో 1,964కి.మీ మేర డ్రైనేజీకి గానూ 2,220కి.మీ, సూర్యాపేట జిల్లాలో 1,221 గానూ 1,221కి.మీ, యాదాద్రి జిల్లాలో 1,159 గానూ 2,078 కిలోమీటర్ల మేర డ్రైనేజీలను శుభ్రపరిచి మురుగు నీరు సక్రమంగా పారేలా చర్యలు చేపట్టారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ భవనాలు వంటి ప్రభుత్వ సంస్థల భవనాల ఆవరణాలను సైతం శుభ్రపరిచారు. ఇలా శుభ్రమైన సంస్థల్లో నల్లగొండ జిల్లాలో మొత్తం 4,072 సంస్థలకు గానూ 4,481, సూర్యాపేట జిల్లాలో 1,902కు గానూ 2,075, యాదాద్రి జిల్లాలో 1,499 సంస్థలను శుభ్రం చేయాలనే లక్ష్యంగా ఎంచుకోగా 3,515 సంస్థల్లోని పరిసరాలను శుభ్రపరిచారు. దాంతో అన్నిచోట్ల వర్షాకాలం ప్రారంభంలోనే పరిశుభ్రత నెలకొంది.
ముళ్లపొదల తొలగింపు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆవాసాల్లోని ముళ్లపొదలను తొలగించి, రోడ్లపై గుంతలను పూడ్చుతూ లోతట్టు ప్రాంతాలను మట్టితో నింపి చదును చేశారు. నల్లగొండ జిల్లాలో 2,356 స్థలాల్లో ముళ్లపొదలు, సర్కార్ తుమ్మలను తొలిగించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు వంద శాతం పూర్తి చేశారు. 1,912 రోడ్లపై గుంతలను పూడ్చారు. లోతట్టు ఏరియాల్లో 1,873 చోట్ల మట్టి నింపాలని టార్గెట్‌గా పెట్టుకోగా అన్ని చోట్ల నింపేశారు. సూర్యాపేట జిల్లాలో 3,210 ముళ్లపొదలు, సర్కార్తుమ్మ స్థలాలను శుభ్రం చేశారు. 1,194 చోట్ల రోడ్లపై గుంతలను పూడ్చివేశారు. 947 లోతట్టు ప్రాంతాల్లో మట్టిని నింపి చదును చేశారు. యాదాద్రి జిల్లాలో 2,273 ముళ్లపొదలకు గానూ మొత్తం క్లీన్ చేశారు. 5,99 చోట్ల గుంతలు ఉన్నట్లు గుర్తించి పూడ్చేశారు. 326 చోట్ల లోతైన ప్రదేశాలను మట్టితో నింపేసారు.
పడావు పడ్డ బావుల పూడ్చివేత
పాత బావులు, వదిలేసిన బోరుబావులను కూడా పల్లెప్రగతిలో పూడ్చివేశారు. నల్లగొండ జిల్లాలో 69 పాతబావులను, 92 బోరు రంధ్రాలను గుర్తించి పూడ్చివేశారు. సూర్యాపేట జిల్లాలో 98 పాతబావులు, 99 బోరు రంధ్రాలను, యాదాద్రి జిల్లాలో 13 పాతబావులు, 71 బోరు రంధ్రాలను పూడ్చివేశారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదాన కార్యక్రమాలు విస్త్రతంగా నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో 844 చోట్ల 23,616 మంది, సూర్యాపేట జిల్లాలో 475 చోట్ల 17,357 మంది, యాదాద్రి జిల్లాలో 421 చోట్ల 17,583 మంది ప్రజలు భాగస్వాములయ్యారు. వీరితో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, వీధులను శుభ్రం చేసినట్లు అధికారులు తెలిపారు.
వైకుంఠధామాల్లో వసతులు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైకుంఠధామాల్లో పెండింగ్‌లో ఉన్న కరెంటు సరఫరా, నీటి వసతి, టాయిలెట్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చారు. నల్లగొండ జిల్లాలోని 183 వైకుంఠధామాల్లో 156 చోట్ల కరెంట్ కనెక్షన్, 118 చోట్ల నీటి వసతిని ఏర్పాటు చేశారు. మరో 79 చోట్ల మరుగుదొడ్ల వసతిని కల్పించారు. సూర్యాపేట జిల్లాలోనూ 41 చోట్ల కరెంటు, 58 చోట్ల నీటివసతి, 88 వైకుంఠధామాల్లో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. యాద్రాది జిల్లాలో 255 వైకుంఠధామాలకు గానూ 87చోట్ల విద్యుత్, 156 చోట్ల నీటివసతి కల్పించాల్సి ఉండగా 78 చోట్ల పనులు పూర్తి చేశారు. మిగతా అన్నింటిలోనూ పల్లె ప్రగతితో సంబంధం లేకుండా పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హరితహారం కోసం
పల్లె ప్రగతిలో భాగంగా హరితహారంలో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలతో పాటు రహదారులను గుర్తించారు. నల్లగొండ జిల్లాలో 607 కిలోమీటర్ల పొడవునా అవెన్యూ ప్లాంటేషన్, 55 చోట్ల మెగా పల్లె ప్రకృతి వనాల పెంపకం కోసం స్థలాలను ఎంపిక చేశారు. సూర్యాపేట జిల్లాలో 461 కిలోమీటర్ల రహదారులను, 83 మెగా ప్రకృతి వనాల పెంపు స్థలాలను, యాదాద్రి జిల్లాలో 281 కిలోమీటర్ల రహదారులను, 25 మెగా ప్రకృతి వనాల పెంపునకు స్థలాలను గుర్తించారు. వర్షాలు కురియగానే ఉద్యమంలా హరితహారం చేపట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
క్రీడా మైదానాలు ప్రారంభం
పల్లె ప్రగతిలో ప్రధానంగా అజెండాగా ఈ సారి ప్రభుత్వం తెలంగాణ క్రీడా మైదానాలను కూడా చేపట్టింది. గ్రామాల్లో అనువైన ఆటస్థలాలను ఎంపిక చేస్తూ కొన్ని చోట్ల ప్రారంభించారు కూడా. క్రీడా మైదానాలకు స్థలాల గుర్తింపు, చదును చేయడం, ప్రారంభించడానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలోనూ ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
విద్యుత్ సమస్యల పరిష్కారం
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరాను సరిచేసే కార్యక్రమానికి పెద్దపీట వేశారు. అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 4,72 చోట్ల మూడో లైన్ సమస్యను పరిష్కరించడంతో పాటు 249 కొత్త స్తంభాలను పాతారు. సూర్యాపేట జిల్లాలో 1551 చోట్ల మూడో తీగ, 919 కొత్త పోల్స్‌ను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో 313 చోట్ల థర్డ్‌వైర్, 138 కొత్త పోల్స్ పాతారు. ఈ పనుల నిర్వహణ సంబంధిత కాంట్రాక్టర్లే చేయాల్సి రావడంతో వీరు ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో వీటిని చేపడుతున్నారు.
పల్లె ప్రగతి విజయవంతం
పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. 15 రోజుల్లో గ్రామాల్లో అనేక కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాం. వీధులను, రోడ్లను శుభ్రపర్చడంతో పాటు పారిశుధ్య పనులు నిర్వహించాం. దాంతో గ్రామాల్లో స్వచ్ఛ వాతావరణం ఏర్పడింది. క్రీడా మైదానాల కోసం, మొక్కల పెంపకానికి స్థలాల గుర్తింపునకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది తర్వాత కూడా నిరంతరం కొనసాగుతుంది. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు కూడా పూర్తి అయ్యే వరకు కొనసాగుతాయి. పల్లె ప్రగతి విజయవంతానికి సహకరించిన జిల్లా ప్రజాప్రతినిధులకు, వివిధ స్థాయిల్లోని అధికారులకు, ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
– డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, నల్లగొండ