కోదాడ రూరల్, జూన్ 18 : అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్. రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. శనివారం కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. కోదాడ పట్టణ కేంద్రంగా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి గుట్కా వ్యాపారం చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పట్టణ పోలీసులు రైడ్ చేసి రూ.1,17,123 విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కోదాడ మండలం దొరకుంట గ్రామానికి చెందిన ఎస్కే ఖయ్యూం, కాపుగల్లు గ్రామానికి చెందిన దైద సైదులు, మేళ్లచెర్వు మండలం వేపలమాధారానికి చెందిన ఎస్కే అజీజ్, కోదాడ పట్టణానికి చెందిన ఎస్కే ఫయాజుద్దిన్, ఎస్కే అమీర్‌పాషా ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఖయ్యూం తన కారులో బీదర్ నుంచి గుట్కా,, ఇతర ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను తీసుకువచ్చి మిగిలిన నలుగురితో సరఫరా చేయిస్తుంటాడు. పట్టణంలోని రాయల అపార్ట్మెంట్లో గుట్కా ఉన్నదన్న పక్కా సమాచారంతో రైడ్ చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిం దితులను అరెస్టు చేయడంలో చాకచక్యం ప్రదర్శించిన పట్టణ సీఐ నరసింహారావు, ఎస్ఐలు రాంబాబు, నాగభూషణం, ఏఎస్ఐ వి.మల్లేశ్, పీసీలు సతీశ్, యల్లారెడ్డిను ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డు ప్రకటించారు. సమావేశంలో కోదాడ, సూర్యాపేట డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, నాగభూషణం, సీఐ పి.ఎన్.డి ప్రసాద్, ఎస్సైలు సాయిప్రశాంత్, మగ్దూంఅలీ పాల్గొన్నారు.
92.1 కేజీల గంజాయి దహనం
కోదాడ రూరల్ : కోదాడ పట్టణ, రూరల్ పోలీసులు కొంతకాలంగా చేపట్టిన సోదాల్లో సీజ్ చేసిన 92.1 కేజీల గంజాయిని దహనం చేశారు. జిల్లా కోర్టు డిస్ట్రాయ్ ఆదేశానుసారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ అండ్ డిస్ట్రాక్టన్ కమిటీ అధ్వర్యంలో కట్టకొమ్ముగూడెం సమీపంలోని మైదానంలో డిస్పోజల్ అండ్ డిస్ట్రాక్టన్ కమిటీ సభ్యుడు ఎస్పీ ఎస్.రాజేంద్రప్రసాద్ దహనం చేశారు.
అంతరాష్ట్ర దొంగలు ఇద్దరు అరెస్ట్..
కోదాడ పట్టణ ఎస్ఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టగా బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో వీరు అంతరాష్ట్ర దొంగలుగా తేలినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని బాలానగర్ రాజుకాలనీకి చెందిన మహ్మద్ అమ్జద్, అత్తాపూర్‌కు చెందిన మహ్మద్ అబుద్ బిన్ హాజీ ఇరువురు పాత నేరస్తులేనన్నారు. హైదరాబాద్‌లో వీరిపై అనేక దొంగతనం, హత్య కేసులు నమోదైనట్లు వివరించారు. కోదాడ పట్టణంలోని బంజర్కాలనీ, సూర్యాపేట బంక్ దొంగతనం కేసులోనూ వీరు నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ పేర్కొనారు.