కొండాపూర్, జూన్ 13 : ప్రాణహాని నెపంతో అనుమతి లేకుండా తుపాకులతో తిరుగుతున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, తపంచా, రెండు మ్యాగజైన్లు, 13 బుల్లెట్లు, కారు, స్కూటీ, 6 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శిల్పావల్లి కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, వైన్స్ నిర్వాహకుడు జి. సాయికృష్ణ (26), అతడి స్నేహితుడు సాయిరాం హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. తమకు ప్రాణహాని ఉందని భావించిన వారు తుపాకులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. సాయిరాం హైదరాబాద్‌లో ఉంటూ స్థానికంగా బిగ్ బాస్కెట్లో టీం లీడర్‌గా పని చేస్తున్నాడు. అతడికి అదే సంస్థలో పని చేసే తమిళనాడులోని పురుమనాల్కు చెందిన స్వాన్ లియోనార్డ్ కన్నాతో పరిచయం ఉంది.
కన్నా ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడికి బీహార్‌లో గన్స్ సరఫరా చేసే వ్యక్తులతో పరిచయం ఉందని తెలుసుకున్న సాయిరాం, సాయికృష్ణ కన్నా ద్వారా గన్స్ కోనాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు బీహార్ వెళ్లి రూ.2 లక్షలతో గన్స్ సప్లయర్స్ నుంచి గన్, బుల్లెట్లు కొనుగోలుచేసి హైదరాబాద్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు ఈ నెల 12న మియాపూర్ సాయిరాం టవర్స్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా వారు మారణాయుధాలతో పట్టుబడ్డారు. స్కూటీపై ఉన్న కన్నా వద్ద తపంచా, 9 బుల్లెట్లు, బెలీనో కారులో ఉన్న సాయిరాం, సాయికృష్ణ వద్ద కంట్రీ మేడ్ పిస్టల్, మ్యాగజైన్, నాలుగు బుల్లెట్లు, రెండు మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గన్ సప్లయర్ అలోక్ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో మియాపూర్ ఏసీపీ కృష్ణ, మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శివ పాల్గొన్నారు.