నల్లగొండ, జూన్ 11;ఉమ్మడి రాష్ట్రంలో నిధుల్లేక నీరసించిన పల్లెలు నేడు శాశ్వత వనరులతో కళకళలాడుతున్నాయి. పల్లెపల్లెనా ప్రకృతి వనం దర్శనమిస్తున్నది. మంచీచెడులు మాట్లాడుకునేందుకు రైతులకు ఓ వేదిక దొరికింది. చివరి మజిలీ కష్టాలను తీరుస్తూ వైకుంఠధామాలు వెలిశాయి. సెగ్రిగేషన్ షెడ్లు చెత్త నుంచి స్వచ సంపదను సృష్టిస్తున్నాయి. పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన ఈ ఆస్తుల జాబితాలో తాజా గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వచ్చి చేరుతున్నాయి.
గ్రామీణ ప్రాంత క్రీడాకారుల వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు, మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీ, ఆవాసంలో ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేస్తున్నది. ఫిట్నెస్ కోసం రోడ్ల వెంట పరుగులు తీసే బాధ లేకుండా, ప్రాక్టీస్ కోసం ఖాళీ జాగ కోసం అవస్థ పడకుండా కనీసం అరెకరానికి పైగా స్థలాన్ని ఎంపిక చేస్తున్నది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్ బాల్ కోర్టులతోపాటు వ్యాయామానికి లాంగ్ బార్ సింగిల్, డబుల్ స్తంభాలను సిద్ధం చేస్తున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 160 ప్రాంగణాలు ప్రారంభోత్సవం చేసుకుని అందుబాటులోకి వచ్చాయి. అక్కడక్కడా పోలీస్ ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవడం కూడా మొదలైంది. మిగతా చోట్ల ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి.
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతోపాటు క్రీడాకారుల నైపుణ్యం పెంపునకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వస్తున్నాయి. నెల రోజుల కిందటే క్రీడా మైదానాలకు శ్రీకారం చుట్టిన సర్కార్ వాటి ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేసింది. దాంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 160 ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 2,804 గ్రామాలు ఉండగా, అధికార యంత్రాంగం అందులో 1,311 గ్రామాల్లో 707 ఎకరాలు సేకరించింది.
ప్రతి మండలంలో రెండు చొప్పున మూడు జిల్లాల్లోని 71 మండలాల్లో 142 గ్రామాలతోపాటు 18 మున్సిపాలిటీల్లో ఒక్కోటి చొప్పున మొత్తంగా 160 ప్రాంగణాలను ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో 610 గ్రామాల్లో స్థలాలను గుర్తించగా.. 69 ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడా సామగ్రి, గ్రౌండ్‌ను సిద్ధం చేశారు. ఆ మైదానాల్లో పోలీస్ ఉద్యోగార్థులతోపాటు క్రీడాకారులు వ్యాయామం, ఆటల కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెల 13న పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తి కాగానే అధికారులు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై పూర్తిగా దృష్టి సారించనున్నారు.
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి మట్టిలో మాణిక్యాలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పంచాయతీలతోపాటు ప్రతి ఆవాసంలోనూ ఆట స్థలాలు ఏర్పాటు చేసి పిల్లలు, యువతకు ఆటల పట్ల ఆసక్తి కలిగించేందుకు పూనుకున్నది. అనుకున్నదే తడవుగా ఒక్కో ఆవాస గ్రామంలో అర ఎకరం నుంచి ఎకరం వరకు, గ్రామ పంచాయతీల్లో ఎకరం నుంచి ఎకరన్నర వరకు భూమిని గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. సర్కారు ఆదేశంతో అధికార యంత్రాంగం ఆ పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో 608 గ్రామాల్లో 358.37 ఎకరాలు గుర్తించింది. ఈ నెల రెండో తేదీన పట్టణాల్లో ఏడు, గ్రామాల్లో 62 ప్రాంగణాలను ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చారు.
1,311 గ్రామాల్లో స్థలాల గుర్తింపు..
ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీలు, ఆవాసాలు కలిపి మొత్తం 2,804 ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 1,475 గ్రామాలకు 610 గ్రామాల్లో 361 ఎకరాల భూమిని గుర్తించారు. సూర్యాపేటలో 679 గ్రామాలకు 322 గ్రామాల్లో 165 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 650 గ్రామాలకు 379 గ్రామాల్లో 177 ఎకరాల స్థలాన్ని గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 62 ప్రాంగణాలు సిద్ధమయ్యాయి. క్రీడా ప్రాంగణాల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు.
15 రోజుల్లోనే 160 ప్రాంగణాలు..
క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించిన నెల రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలో 160 ఆట స్థలాలను ఏర్పాటు చేశారు. సర్కారు ఆదేశాల మేరకు ఈ నెల రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని 142 ప్రాంగణాలను, 18 మున్సిపాలిటీల్లో 18 మైదానాలను మొత్తంగా 160 ప్రాంగణాలు ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో 610 గ్రామాల్లో స్థలాలను గుర్తించగా.. ఇప్పటి వరకు 69 ప్రాంగణాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్ కోర్టులు, వ్యాయామానికి లాంగ్ బార్ సింగిల్, డబుల్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రూపొందించిన లే అవుట్ ప్రకారం క్రీడా మైదానాన్ని తయారు చేస్తూ చుట్టూ హరితహారం కింద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు.
క్రీడలకు సర్కారు ప్రోత్సాహం; దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
చందంపేట, జూన్ 11 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలంలోని హంక్యతండాలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులు తమలోని నైపుణ్యాలను మెరుగు పర్చుకునేందుకు క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముత్యాల సర్వయ్య, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మంగమ్మ, రమేశ్, గోవిందుయాదవ్, మోహన్‌కృష్ణ, అనంతగిరి, రామకృష్ణ, కృష్ణ, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
క్రీడా ప్రాంగణాలకు తరలుతున్న ఉద్యోగార్థులు
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో ఉద్యోగార్థులు అందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కో నియోజకవర్గంలో వెయ్యి నుంచి రెండు వేల మందికి పోలీస్, ఇతర ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పల్లెలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను వ్యాయామం, రన్నింగ్‌కు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం పల్లె ప్రగతి పనులు కొనసాగుతుండడంతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు కాస్త ఆలస్యం అవుతుండగా.. ఈ నెల 13 తర్వాత నుంచి ఆట స్థలాలపైనే పూర్తిగా దృష్టి సారించనున్నారు. ప్రతి ప్రాంగణంలో కోర్టుల ఏర్పాటు ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేసి, గ్రామ పంచాయతీ నిధులతో స్తంభాలు, గేట్ నిర్మాణం, ఆర్చ్, నేమ్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాస్కెట్ బాల్, వాలీబాల్ కిట్లతోపాటు క్రీడాకారులకు టీ షర్ట్స్ ఉచితంగా అందజేయనున్నది.
ఉచితంగా స్పోర్ట్స్ కిట్లు కూడా..
ప్రతి గ్రామంలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా గ్రామాలు, ఆవాసాల్లో భూమిని గుర్తించగా.. ఇప్పటి వరకు 62 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉండగా.. అందులో 608 గ్రామాల్లో 358 ఎకరాల భూమిని గుర్తించాం. 631 ఆవాసాలకు రెండు ప్రాంతాల్లో మూడెకరాల స్థలం గుర్తించాం. పల్లె ప్రగతి వల్ల క్రీడా ప్రాంగణాల పనులు ఆలస్యం అవుతున్నాయి. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఉచితంగా స్పోర్ట్స్ కిట్లతోపాటు క్రీడాకారులకు టీ షర్ట్స్ అందజేయనుంది.
– దేప విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్లగొండ