నిడమనూరు, జూన్ 11 : మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట గల మిట్టపల్లి భిక్షమయ్య, జ్యోతి కిరాణం దుకాణాల్లో దొంగలు షట్టర్లను ఇనుప రాడ్డు తో తొలిగించి లోపలికి ప్రవేశించారు. జ్యోతి కిరాణం లోని గల్లా పెట్టెలో ఉన్న నగదు ను అపహరించారు. భిక్షమయ్య దుకాణంలో నగదు లేకపోవడంతో వెళ్లిపోయారు. శనివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వెళ్లిన యజమానులు షెట్టర్లు ఇనుప రాడ్లతో పైకిత్తినట్లు గుర్తించి అనుమానంతో లోనికి వెళ్లి చూడగా గుర్తు తెలియని దొంగలు నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. ఘటనపై దుకాణాల యజమానులు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
శాంతి నగర్లో ఇంట్లో ..
మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లో శుక్రవారం రాత్రి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. పట్టణ సీఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన చేపల భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు కిటికీలు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులో ఉన్న 12 తులాల బంగారం, రూ.15 వేల నగదు దొంగిలించినట్లు తెలిపారు. తెల్లవారు జామున నిద్ర లేచి చూడగా బీరువా తెరిచి ఉండడంతో భయపడిన భాస్కర్ 100కు డయల్ చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.