ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు పలు మండలాల్లో భారీ నష్టం కలిగింది. ఇండ్ల రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు నేలకూలిపోవడంతోపాటు విద్యుత్ స్తంభాలు ఒరిగిపడ్డాయి. మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడెంలో కోళ్లఫారం కూలిపోయి 2,500 కోడిపిల్లలు మృతిచెందాయి. ఆత్మకూర్.ఎస్ మండలం బొప్పారంలో ఇంటిరేకులు ఎగిరిపోయాయి. వానకాలం సీజన్‌కు ముందే జల్లులు పడడంతో వాతావరణం చల్లబడింది. ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది.
భువనగిరి, కలెక్టరేట్ : అత్యధికంగా గుండాల మండలంలో 23.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుర్కపల్లిలో 8.8 మిల్లీమీటర్లు, ఆలేరులో 4.9, మోటకొండూర్ లో 4.3, యాదగిరిగుట్టలో 23, భువనగిరిలో 10.2, బొమ్మలరామారంలో 7.3, బీబీనగర్‌లో 1.9, చౌటుప్పల్‌లో 3.2, సంస్థాన్‌నారాయణపురంలో 0.5, రామన్నపేటలో 0.9, వలిగొండలో 1.1, ఆత్మకూర్(ఎం)లో 12.8, మోత్కూర్‌లో 13.4, అడ్డగూడూరులో 20.8, గుండాలలో 23.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా సగటున 8.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో పాటు వీచిన గాలులతో ఇండ్ల రేకులు ఎగిరిపడ్డాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపడ్డాయి. పలుచోట్ల కోళ్లఫారాల షెడ్లు కూలిపోయాయి. మునుగోడు, చండూరు, నాంపల్లి, యాదగిరిగుట్ట, ఆత్మకూర్.ఎం, మోటకొండూర్, వలిగొండ, అడ్డగూడూరు, రామన్నపేట, సూర్యాపేట, హుజూర్నగర్, నాగారం, తిరుమలగిరి, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, కేతేపల్లి, మాడ్గులపల్లి మండలాల్లో జల్లులు పడ్డాయి. చెట్లు కూలిపోవడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
వలిగొండ మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన పల్లపు లక్ష్మమ్మకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. రూ.లక్ష నష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. చండూరు మండల కేంద్రంలోని రిక్షా కార్మికుడు సంగెపు వెంకటేశం ఇంటి పై కప్పు రేకులు లేచి పక్కింటిపై పడడంతో బోడ నర్సింహ ఇల్లు కూడా ధ్వంసమైంది. రోడ్డు పక్కన చెట్లు విరిగి పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మండలం మహ్మదాపురంలో గాలి వానకు విద్యుత్ స్తంభం కూలిపోయింది. కిరాణా డబ్బాపై చెట్టు కూలడంతో ధ్వంసమైంది. దామెర గ్రామంలో రాళ్ల వాన పడింది. ఆత్మకూర్.ఎస్ మండలం బొప్పారంలో ఎడ్ల నర్సయ్యకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఓ వీధిలోని చెట్లు కూలగా రేకుల షెడ్డు ధ్వంసమైంది.

వలిగొండ మండలంలోని కంచనపల్లి గ్రామానికి చెందిన పల్లపు లక్ష్మమ్మకు చెందిన ఇంటిపై రేకులు ఈదురు గాలులకు ఎగిరిపోయాయి. రూ.లక్ష నష్టం జరిగిందని బాధితురాలు వాపోయింది. చండూరు మండల కేంద్రంలోని రిక్షా కార్మికుడు సంగెపు వెంకటేశం ఇంటి పై కప్పు రేకులు లేచి పక్కింటిపై పడడంతో బోడ నర్సింహ ఇల్లు కూడా ధ్వంసమైంది. రోడ్డు పక్కన చెట్లు విరిగి పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మండలం మహ్మదాపురంలో గాలి వానకు విద్యుత్ స్తంభం కూలిపోయింది. కిరాణా డబ్బాపై చెట్టు కూలడంతో ధ్వంసమైంది. దామెర గ్రామంలో రాళ్ల వాన పడింది. ఆత్మకూర్.ఎస్ మండలం బొప్పారంలో ఎడ్ల నర్సయ్యకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఓ వీధిలోని చెట్లు కూలగా రేకుల షెడ్డు ధ్వంసమైంది.

మునుగోడు మండల కేంద్రంలోని లక్ష్మీదేవిగూడెంలో బొడ్డు లక్ష్మీపతికి చెందిన కోళ్ల షెడ్డు కూలిపోవడంతో 2,500 కోడిపిల్లలు మృతిచెందాయి. మునుగోడులోని బుచ్చాలు బంగ్లా వద్ద ఉన్న హనుమాన్ ఆలయం పక్కన కరంటు తీగలపై చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో ట్రాన్స్‌కో ఏఈ వరప్రసాద్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
