యాదాద్రి, ఏప్రిల్ 6 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్న భక్తులకు గోత్రనామాల పేరిట అర్చనలు చేశారు. ప్రధానాలయ అద్దాల మండపంలో భక్తులకు వేదాశీర్వచనం ఇచ్చి స్వామి ప్రసాదం అందజేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దర్శనాలు నిరాటంకంగా కొనసాగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన వైభవంగా నిర్వహించారు. కొండకింద గల గోశాల వద్ద నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి బాలాలయంలో సీతారామచంద్రస్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ఐదో రోజుకు చేరాయి. స్వామికి రామ మానస, ప్రాతఃకాల మధ్యాహ్నిక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఖజానాకు బుధవారం రూ.13,56,004 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు. శ్రీవారిని రాష్ట్ర సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ బుద్ద మురళి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భానుడి భగభగతో యాదాద్రి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తులు ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు వసతుల కల్పనపై అధికారులు చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ స్వచ్ఛమైన నీటి వసతి, తాత్కాలిక మొబైల్ మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు క్యూ లైన్లలో ఫ్యాన్లను బిగించారు. క్యూ కాంప్లెక్స్‌లోని మొదటి, మూడో అంతస్తులో అదనంగా మొబైల్ టాయిలెట్స్‌తో పాటు తాగునీటి నల్లాలు అమర్చారు. దర్శనం చేసుకుని తిరిగి వచ్చే పడమర రాజగోపురం పక్కన ఒకటి, మాఢవీధుల్లోని ఉత్తరదిశలో మరోటి స్వచ్ఛమైన తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్యూ కాంప్లెక్స్‌లో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఒకటి రెండు రోజుల్లో క్యూ కాంప్లెక్స్‌లో ఏసీలు అందుబాటులోకి రానున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. క్యూ కాంప్లెక్స్‌లోనే భక్తుల సామగ్రి, సెల్ఫోన్లు భద్రపరిచేందుకు క్లాక్రూంలను ఏర్పాటు చేశారు. ప్రధానాలయంలో గురువారం నుంచి ఏసీలు అందుబాటులోకి రానున్నాయి. కొండపైన క్యూ కాంప్లెక్స్ వద్ద గల రిసెప్షన్ కార్యాలయంలో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సౌకర్యార్థం వీల్‌చైర్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రధానాలయం, క్యూ కాంప్లెక్స్ ప్రాంగణంలో అదనంగా 50మంది పురుషులు, 50మంది స్త్రీలకు ప్రత్యేకమైన మరుగుదొడ్లను అందుబాటులో ఉంచారు.
యాదాద్రి కొండపైకి వెళ్లే భక్తులకు రెండు నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొండ కింద ఆర్టీసీ బస్టాండ్ నుంచి టికెట్ల కౌంటర్లు, కల్యాణకట్ట, పార్కింగ్, వసతి గృహాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి కలుపుతూ ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ వారి నివేదిక ప్రకారం ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచారు. కొండకింద సెంట్రల్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో భక్తలకు ఉచిత దర్శన టికెట్లు, ఆర్జిత పూజల టికెట్లు అందించనున్నారు. సెంటర్ వద్దే తాగునీటి వసతితోపాటు మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు స్నానమాచరించేందుకు సకల సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. బాత్రూం, మురుగుదొడ్లు, తాగునీటి వసతిని కల్పించారు.