రామగిరి, మార్చి 29: ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి, మన బస్తీ-మన బడి’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సంచాలకులు దేవసేన స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల నూతన భవన నిర్మాణాలు, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఇందుకోసం ఆన్లైన్లో వచ్చే ప్రతిపాదనలకు తక్షణమే అనుమతులు ఇస్తున్నామన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపికైన పాఠశాలలు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలోని కొండమల్లేపల్లి పాఠశాలలో అత్యధిక విద్యార్థులున్నారని వారిని బాలురు, బాలికల పాఠశాలలుగా విభజించాల్సి ఉందని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, డీఈఓ భిక్షపతి, పాఠశాల విద్య సంక్షేమ మౌలిక వసతుల సంస్థ ఈఈ అనిత, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, ఆర్ అండ్ బీ ఈఈ నరేందర్ ఉన్నారు.
నూతన భవన నిర్మాణాలకు చర్యలు
-కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నూతన భవనాల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ స్పష్టం చేశారు. ‘మన ఊరు – మన బడి, మన బస్తీ- మన బడి’లో భాగంగా నల్లగొండలో డీఈఓ భిక్షపతి, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి అధికారులతో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కేంద్రంలో అద్దె భవనాల్లో కొనసాగుతూ మన ఊరు-మన బస్తీకి ఎంపికైన పాఠశాలలను తనిఖీచేశారు. బొట్టుగూడలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, మాన్యంచెల్కలోని ప్రభుత్వ ఉర్దూ, తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలలు తొలి విడతలో ఎంపికైనట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకాశంబజార్‌లోని స్కౌట్ హాల్, పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయం, పశువైద్యశాల సముదాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.