తుంగతుర్తిలో 100 పడకలు, మోత్కూరులో 30 పడకల స్థాయికి పెంచాలి
అర్వపల్లిలోని యోగానందుడి ఆలయానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలి
అసెంబ్లీలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్
మోత్కూరు, మార్చి 12 : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బడ్జెట్ పద్దులపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలకు, మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. సమగ్రమైన పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పీహెచ్‌సీలను ఏర్పాటు చేయడంతో వైద్య సిబ్బంది పెరిగి సమస్యలు పరిష్కారం కానున్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని తెలిపారు. గత ఎన్నికల సమయంలో నియోజవకర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం కోసం రూ.35 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేయగా వైద్య ఆరోగ్య శాఖ పేషీలో ఉందన్నారు. అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పునర్వైభవం కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు.