జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్ జగ్జీవన్కుమార్
రామగిరి, మార్చి 12 : కక్షిదారుల సత్వర న్యాయానికి లోక్అదాలత్లు దోహదం చేస్తాయని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు బీఎస్ జగ్జీవన్కుమార్ అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థలో శనివారం నిర్వహించిన లోక్అదాలత్ను ఆయన ప్రారంభించి మట్లాడారు. ఒకసారి లోక్ అదాలత్లో తీర్పు వస్తే తిరిగి అప్పీలు చేసుకునే అవకాశం ఉండదని పేర్కొన్నారు. లోక్ అదాలత్తో కక్షిదారులకు సమయం ఆదాతోపాటు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయన్నారు. ఈ సందర్భంగా పలు సివిల్, క్రిమినల్, బ్యాంక్ కేసులను పరిష్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు, మొదటి అదనపు న్యాయమూర్తి నాగరాజు, నాలుగో అదనపు జడ్జి పద్మజ, వివిధ కోర్టుల న్యాయమూర్తులు వెంకటేశ్వర్లు, తిరుపతి, కీర్తిచంద్రిక, సౌమ్య, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.