యాదాద్రి భువనగిరి జిల్లాలో కరువు కోరులు చాచింది. దశాబ్ద కాలం సిరిసంపదలతో వెలుగొందిన చోట కరాళ నృత్యం చేస్తున్నది. జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో పొట్ట దశలో పంటలు ఎండిపోతున్నాయి. ఏ గ్రామానికి వెళ్లినా, ఎండి నెర్రెలు వారినే పొలాలే కనిపిస్తున్నాయి. రైతును కదిలించినా కన్నీటి వ్యథలే వినిపిస్తున్నాయి.
20 వేల ఎకరాల్లో పంట నష్టం
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సుభిక్షంగా ఉన్నా డు. సాగు నీరు, పెట్టుబడి సాయం, ఎరువులు, మద్దతు ధర అన్నీ సవ్యంగా అందాయి. ధాన్యం కొనుగోళ్లు సైతం సజావుగా సాగాయి. కానీ, ప్రస్తుతం ప్రభుత్వ పట్టింపులేనితనంతో అన్నదాత అరిగోస తీస్తున్నాడు. నీళ్లు లేక పొట్ట దశలోనే పంటలు ఎండిపోతున్నాయి. జిల్లాలోని అధిక శాతం మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 2.8 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు.
ఎక్కువ శాతం మంది వరే వేశారు. ఇందులో ఇప్పటికే 20 వేల ఎకరాలు ఎండిపోయినట్లు తెలుస్తున్నది. అధికారికంగానే 4 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా సంస్థాన్‌నారాయణపురం, భువనగిరి, గుండాల, రాజాపేట, మోతూరు, చౌటుప్పల్, తురపల్లితోపాటు పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నీళ్లు లేపోవడంతో నేలలు నెర్రెలు బారాయి. వరి పైర్లు ఎండు గడ్డిలా మారాయి. దాంతో చేసిదిలేక రైతులు పశువులు, జీవాలను మేపుతున్నారు.
అడుగంటిన భూగర్భ జలాలు..
జిల్లాలో కొన్నేండ్ల నుంచి భూగర్భ జలాలు పుషలంగా ఉంటున్నాయి. ఏటా పాతాళ గంగ పైపైకి ఉబికి వచ్చింది. నాలుగు నుంచి ఐదు మీటర్ల లోతులోనే నీటి మట్టం ఉండేది. ఈ ఏడాది మాత్రం పలు కారణాలతో భూగర్భ జలాలు వేగంగా పడిపోయాయి. జిల్లా సగటున 21 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. గతానికి ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండకాలానికి ముందే చెరువులు ఖాళీ అయ్యాయి. ప్రభుత్వ పట్టింపులేమితో ఎకడికకడ ఎండిపోయి కనిపిస్తున్నాయి. జిల్లాలో సగం చెరువులు అడుగంటాయి. 420కిపైగా చెరువుల్లో నీళ్లేలేవు. దాంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు వేలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు వేసినా చుక నీరు పడడం లేదు. కొందరు రైతులు డబ్బులు ఖర్చు చేసి ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీరు అందిస్తున్నారు.
నష్టాల ఊబిలో అన్నదాతలు
రైతులు వరి సాగుకు సుమారుగా ఎకరాకు రూ.25 వేల వరకు పట్టుబడి పెట్టారు. ఎకరాకు దాదాపు 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ.2వేలు అనుకున్నా రూ. 56వేల వరకు రావాలి, ఎకరం భూమి నుంచి సరిగ్గా పంట దిగుబడి వస్తే పెట్టుబడి పోనూ రూ.33వేలు మిగులుతుంది. ఇప్పుడు పంటలు ఎండిపోవడంతో ఎకరానికి రూ.33 వేల దాకా నష్టం వాటిల్లిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
కరువు మండలాల కోసం డిమాండ్
జిల్లాలో కరువు తాండవిస్తుండడంతో కరువు మండలాలుగా ప్రకటించాలని అనేక చోట్ల డిమాండ్ వినిపిస్తున్నాయి. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతోపాటు రైతులు ఆందోళన, నిరసనలు చేపడుతున్నారు. కరువు మండలంగా ప్రకటిస్తే ప్రత్యేకంగా నిధులు విడుదలవుతాయి. ఫలితంగా రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఊరట కలిగే అవకాశం ఉంటుంది.
ఆత్మకూరు(ఎం)లో వెయ్యెకరాల్లో ఎండిన వరి
ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలోని 23 గ్రామాలలో 18వేల ఎకరాలలో వరిసాగు చేయగా, భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లు ఎండిపోవడంతో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి పైర్లు ఎండిపోయాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో చుక్కనీరు కనపడడం లేదు. ఎండిన పంటలు పశువులకు, గొర్రెలకు మేతగా మారాయి. దాదాపు ఏ గ్రామంలో చూసినా ఇలాంటి పరిస్థితే ఉంది. అధికారులు గానీ, ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నాలుగెకరాల్లో వరి పెడితే మొత్తం ఎండిపోయింది
నాకున్న నాలుగెకరాల భూమిలో వరి నాటు పెట్టాను. ఎకరానికి 30 వేల రూపాయల లెక్కన లక్షా 20 వేల పెట్టుబడి అయ్యింది. తీరా పంట పొట్ట దశకు వచ్చే సరికి బోర్లలో నీళ్లు లేక పంటంతా ఎండిపోయింది. ఎండిన చేనును పశువుల మేతకు వదిలిపెట్టాను. ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు కూడా అందలేదు. కనీసం ఎండిపోయిన పొలాలనైనా పరిశీలించి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – ఎలిమినేటి రంగారెడ్డి, రైతు, ఆత్మకూరు(ఎం)