పాత, కొత్త సినిమా పాటలు ఏవైనా ఇట్టే పాడేస్తాడు. ఏ గాయకుడి గొంతునైనా అనుకరిస్తాడు. పాటలతో గాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సుంకరి విక్రమ్. టీవీ షోలు, లఘు చిత్రాలు, వెబ్ సిరీస్ ద్వారా ప్రతిభ చూపుతూనే సినిమాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన టైంపాస్ చిత్రంలో మూడు పాటలు పాడగా సర్కారు వారి పాట, కనబడుట లేదు సినిమాల్లో కోరస్ సింగర్‌గా వ్యవహరించాడు.
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి సుంకరి శ్రీనివాస్ కుమారుడు విక్రమ్ స్థానిక ఎస్వీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. చదువుతోపాటు పాటలు పాడుతుండేవాడు. తాను నేర్చుకున్న పాటలతో ప్రతిభ చూపించాలని 2015 సంవత్సరంలో హైదరాబాద్‌కు వెళ్లాడు. మొదట పలు టీవీ షోలు నిర్వహించిన ఆడిషన్స్‌లో పాల్గొని విఫలమయ్యాడు. అయినా కలత చెందకుండా ఎక్కడ ఆడిషన్స్ నిర్వహించినా పాల్గొంటుండేవాడు. 2021లో జీ తెలుగు నిర్వహించిన సరిగమప ఆడిషన్స్‌కు ఎంపికై మొదటిసారి బుల్లితెరపై అడుగు పెట్టాడు.
మొత్తం 24మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో విక్రమ్ టాప్‌టెన్‌లో నిలిచి ప్రముఖ గాయకులు చంద్రబోస్, కోటి, శైలజ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం టీవీ షోలు చేస్తూనే సినిమాల్లో పాటలు పాడుతున్నాడు. ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట, కనబడుట లేదు సినిమాల్లో కోరస్ సింగర్‌గా వ్యవహరించగా.. టైంపాస్ చిత్రంలో మూడు పాటలు పాడాడు. వీటితోపాటు లఘు చిత్రాలు, వెబ్ సిరీస్‌లో కూడా పాడుతున్నాడు. ప్రైవేట్ ఈవెంట్స్, షోలు చేస్తూ తన బృందంతో కలిసి ఆర్కెస్ట్రా, బ్యాండ్ గానాన్ని ప్రదర్శిస్తున్నాడు. సూర్యాపేటకు చెందిన విక్రమ్ గాయకుడిగా ఎదుగడంపై స్థానికులు అభినందిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే ఇష్టం. ఏ సినిమా అయినా, ఏ హీరో పాటైనా పాడుతాను. గాయకుడిగా రాణించేందుకు పలు టీవీ షోల్లో చాలా ప్రయత్నం చేశాను. జీ తెలుగు సరిగమపలో అవకాశం రావడంతో మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం టీవీ షోలతోపాటు చిన్న చిత్రాల్లో పాటలు పాడుతున్నా. గొప్ప గాయకుడిగా కావాలన్నదే నా ఆశయం.
– సుంకరి విక్రమ్