నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 03 : రైతుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తాసీల్దార్ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నాలో భాగంగా నల్లగొండ మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని నాయకులు ఆరోపించారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయ రంగానికి అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు పేర్కొన్నారు. ధర్నా సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మాజీ సర్పంచులు తుమ్మల లింగస్వామి, నారబోయిన బిక్షం, కృష్ణార్జున రెడ్డి, బుచ్చిరాజు, సైదులు, విమలమ్మ, గుండెబోయిన జంగయ్య, బడుపుల శంకర్, శ్రీనాథ్, జయపాల్ రెడ్డి ,నరసింహ, జాన్ రెడ్డి, నర్సిరెడ్డి ,శంకర్, లింగయ్య, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.