Kamal Haasan | కోలీవుడ్‌లో ఓ సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి రానుంది. ‘చిత్తా’, ‘వీర ధీర సూరన్’ వంటి విభిన్న చిత్రాలతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎస్.యు. అరుణ్ కుమార్ తాజాగా విశ్వనటుడు ఉలగనాయగన్ కమల్ హాసన్‌తో సినిమా చేయబోతున్నాడు. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సహజమైన భావోద్వేగాలు, సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడంలో ప్రత్యేక శైలి కలిగిన ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టెస్ట్ షూట్ స్టిల్స్ సోషల్ మీడియాలో లీకై నెట్టింట తెగ వైరల్ కాగా, తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో కమల్ హాసన్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
సాధారణ రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, బలమైన కంటెంట్ మరియు రియలిస్టిక్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్ ఉండబోతున్నట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు అలాగే సాంకేతిక నిపుణుల జాబితాను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.