పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనుండగా జిల్లా వ్యాప్తంగా 6 కేంద్రాల్లో 4,200 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బయోమెట్రిక్ విధానంతో అభ్యర్థుల హాజరు నమోదు చేయనుండగా గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు.
యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 27 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు రిక్యూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించే ప్రిలిమినరీ రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి చేసింది. యాదాద్రి భువనగిరి జోన్‌లోని భూదాన్ పోచంపల్లిలో ఆరు పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
మొత్తం 4,200 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, దేశ్‌ముఖ్, పోచంపల్లిలో కేంద్రంలో 996 మంది, నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, దేశ్‌ముఖ్, పోచంపల్లిలో 996, సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, సెంటర్-బి, దేశ్‌ముఖ్, పోచంపల్లిలో 648, సెయింట్ మేరీ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్, దేశ్‌ముఖ్, పోచంపల్లిలో 600, సెయింట్ మేరీ గ్రూప్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, సెంటర్-ఎ, దేశ్‌ముఖ్, పోచంపల్లిలో 600, సెయింట్ మేరీ ఇంజినీరింగ్ కాలేజీ, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 360 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుతించనున్నారు. ఉదయం 10 తర్వాత నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతి ఉండదు. బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు తీసుకోనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డితో సహా నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 10 మంది ఏఎస్ఐలు, 35 మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనున్నందున ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. పరీక్ష కేంద్రాల సమీపంలోని జీరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయనున్నారు. పరీక్ష కేంద్రానికి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ అధికారులు ఉదయం 4 నుంచే బస్సులను అందుబాటులో తెచ్చారు. పరీక్ష కేంద్రం వద్ద మెడికల్ సిబ్బందిని నియమించారు.
యాదాద్రి భువనగిరి జోన్లో నిర్వహించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి పెన్ను, హాల్‌టికెట్ తప్ప వేటిని అనుమతించం. పోలీస్ శాఖ తరుపున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి ఉద్యోగాలు కూడా రావు. పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.
కె.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్