చండూరు, ఆగస్టు 18 : సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ ప్రభుత్వం మారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని భారతీచంద్ర గార్డెన్స్‌లో గురువారం ఆసరా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పింఛన్ కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో 46 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు 57 ఏండ్లకే పింఛన్ ఇస్తూ ఆర్థిక భరోసా కల్పించడంతో కుటుంబంలో వారికి గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీరు అందిస్తుండడంతో నేడు మునుగోడు నియోజకవర్గంలో ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కావడం లేదని తెలిపారు.
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, జిల్లా మంత్రిని విమర్శించే హక్కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి లేదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడడానికి కడ్లు లేని కబోది అని, గ్రామాల్లో తిరిగితే అభివృద్ధి కనబడుతుందని హితవు పలికారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డి.. కాంట్రాక్టుల కోసం మునుగోడును తాకట్టు పెట్టారని విమర్శించారు.
అనంతరం టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ ఆధ్వర్యంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, వైస్ చైర్పర్సన్ దోటి సుజాతావెంకన్న, కమిషనర్ బి.వెంకట్రామ్, కౌన్సిలర్లు కోడి వెంకన్న, మంచుకొండ కీర్తీసంజయ్, అన్నెపర్తి శేఖర్, కొన్రెడ్డి యాదయ్య, చిలుకూరి రాధికాశ్రీనివాస్, గుంటి వెంకటేశం, అనంత మంగమ్మ, కో ఆప్షన్ సభ్యులు ముజాహిద్దీన్, వహీద్ పాల్గొన్నారు.
చౌటుప్పల్, ఆగస్టు 18 : ప్రజా దీవెన సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ అభివృద్ధిలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజా దీవెన సభకొచ్చి ఆశీర్వదించాలని కోరారు. ఆయన వెంట టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, కౌన్సిలర్ సుల్తాన్‌రాజు, వార్డు అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసాచారి ఉన్నారు.