నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న మునుగోడు ప్రజాదీవెన సభకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రానికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయనున్నారు. మునుగోడులోని చౌటుప్పల్ రోడ్డులో బహిరంగసభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులుగా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు నేతృత్వంలో పలు బృందాలు సభ ఏర్పాట్లల్లో నిమగ్నమయ్యాయి.
సభాస్థలాన్ని సిద్ధం చేయడంతోపాటు వేదిక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇక సీఎం కేసీఆర్ సభకు రోడ్డు మార్గంలో రానున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి బయల్దేరి చౌటుప్పల్, నారాయణపురం మీదుగా మునుగోడు చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రూట్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సభకు విస్తృత ప్రచారం కల్పిస్తూ మండలాల వారీగా ఇన్చార్జిలు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలతో బిజీగా ఉన్నారు.
పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంతోపాటు సామాన్య జనం సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే జనానికి కూడా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను కూడాఅందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సభకు వచ్చే వాహనాలను సైతం ఎక్కడికక్కడే పార్క్ చేసే విధంగా పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 100 ఎకరాల్లో పది చోట్ల మునుగోడుకు మూడు వైపులా పార్కింగ్ స్థలాలను ఎంపిక చేశారు.
ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలు ఆ వైపే నిలిపి అక్కడి నుంచి ప్రజలకు సభాస్థలికి చేరుకునేలా చర్యలు చేపడుతున్నారు. గురువారం కూడా మంత్రి జగదీశ్‌రెడ్డి మధ్యాహ్నం నుంచి మునుగోడులోనే ఉండి సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలిలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి జరుగుతున్న పనులను సమీక్షించారు. నేటి సాయంత్రానికే మెజార్టీ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మునుగోడు నియోజకవర్గంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యమ కాలం నుంచే ప్రత్యేక అనుబంధం ఉన్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ భూతం పట్టి విలవిల్లాడుతున్న మునుగోడు ప్రజల పక్షాన సమైక్య పాలనలో తొలిసారి గొంతెత్తి నినదించిన చరిత్ర కేసీఆర్‌దేనని చెప్పారు. సభాస్థలిలో మంత్రి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించి వారి వెతలను చూసి చలించిపోయారని, వారి బాధలపై స్వయంగా పాట రాశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో ఫ్లోరైడ్‌ను తరిమేస్తామని ఆనాడే ప్రకటించి.. రాష్ట్రం రాగానే ఇక్కడి నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారని అన్నారు.
దాని ఫలితంగానే కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసూ నమోదు కాలేదని, ఇదే కదా కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్లగూడెం రిజర్వాయర్‌ను కూడా నిర్మిస్తున్నారని, ఇంకా అనేక పథకాలతో మునుగోడును అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ఇలాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఆయనకు పదవులపై ఉన్న సోకు అభివృద్ధిపై లేదని, పైగా అభివృద్ధి కోసమే ఉప ఎన్నిక అంటూ డ్రామాకు తెరలేపాడని విమర్శించారు.
కాంట్రాక్టుల కోసం బీజేపీ పంచన చేరి ఉప ఎన్నికకు కారణమయ్యాడని, ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఇక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోక తప్పదన్నారు. మునుగోడు ప్రజా దీవెన సభ ద్వారా బీజేపీ దుర్మార్గాలతోపాటు మోదీ సర్కార్ అసమర్ధ పాలనను ఎండగట్టడమే లక్ష్యమని మంత్రి జగదీశ్‌రెడ్డి వివరించారు. ప్రజా దీవెన సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అందుకు అనుగుణంగా సభా ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.