హాలియా, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. శనివారం నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, నియోజకవర్గాల్లో పోలీసులు, ప్రజాప్రతిని ధుల ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో జాతీయ పతాకాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాంగిరి, ఆగస్టు 13 : ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్యం వచ్చిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. వారి త్యాగాలను అందరికీ చాటి చెప్పేందుకే సీఎం కేసీఆర్ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వంచాలని పిలుపునిచ్చారని తెలిపారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీని ఎన్జీ కళాశాలలో ఆయన ప్రారంభించారు.
పట్టణ ప్రముఖులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్, లయన్స్ ప్రతినిధులు వేలాదిగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో 75 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జమియత్ ఉలామాఏ హింద్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు.
నీలగిరి : రాబోయే తరాలకు భారత జాతి ఖ్యాతిని, స్వాతంత్య్ర పోరాట ప్రాముఖ్యతను తెలియజేయాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
జిల్లా పోలీసు కార్యాలయం నుంచి క్లాక్ టవర్, డీఈఓ ఆఫీసు మీదుగా మిర్యాలగూడ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్, రామగిరి, శివాజీనగర్ మీదుగా జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ సురేశ్‌కుమార్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.