నందికొండ, ఆగస్టు 13 : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో శనివారం మూడో రోజూ డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 4,38,947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా సాగర్ రిజర్వాయర్ నుంచి 4,10,297 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో వెళ్తున్నది.
సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.40 అడుగుల వద్ద 302.3940 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా 8,105 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 8,022, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 3,2845, 24 క్రస్ట్ గేట్లు 10 అడుగులు, 2 గేట్లు 5 అడుగుల ఎత్తు ఎత్తి 3,58,625 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 2,400, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 884.40 అడుగుల వద్ద 212.4385 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 3,63,151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.
అడవిదేవులపల్లి : మండల కేంద్రం శివారులో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల శనివారం కూడా కొనసాగింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3,91,714 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా టెయిల్‌పాండ్ 17 క్రస్ట్ గేట్ల ద్వారా 3,91,991 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇన్చార్జి ఏడీ కె. నరసింహారావు తెలిపారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 7.080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.306 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.