గొల్ల, కురుమలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే ఒక విడుత పూర్తికాగా రెండో విడుతకు ఏర్పాట్లు చేస్తున్నది. 2017-18లో ప్రారంభించిన పథకాన్ని దశల వారీగా జిల్లాలో 32,668 మందికి అందజేసింది. రెండో విడుతలో 32,150 మందికి పంపిణీ చేసేందుకు యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. గతంలో యూనిట్ ధర రూ.1.25లక్షలు ఉండగా ధరలు పెరుగడంతో రూ.1.75లక్షలకు పెంచారు. లబ్ధిదారుడి వాటా గతంలో 25శాతం కింద రూ.31,250 ఉండగా అది రూ.43,750కు చేరింది. ప్రభుత్వం ఆదేశాలు రాగానే కలెక్టర్ పేరిట డీడీలు తీసుకొని పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
నల్లగొండ, ఆగస్టు 1 : వృత్తిదారులకు ఆది నుంచీ ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. గొల్ల కురుమల జీవన విధానంలో మార్పు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే వారి వృత్తి ధర్మాన్ని గౌరవించి 18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తికి 75శాతం సబ్సిడీతో గొర్రెలు అందజేసేందుకు 2017లో చర్యలు చేపట్టింది.
సబ్సిడీ గొర్రెల పథకం కింద ఉమ్మడి వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని గొల్ల కురుమల వివరాలు సేకరించిన జిల్లా యంత్రాంగం.. వారికి రెండు విడుతలుగా జీవాలు అందించేందుకు లిస్టు తయారు చేసింది. తొలి విడుతలో 66,355 మంది లబ్ధిదారులకు ఇప్పటికే గొర్రెల యూనిట్లు మిగిలిన 66,727 త్వరలో ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దాంతో కలెక్టర్ పేర డీడీలు సేకరించి రెండో విడుత ఇవ్వాల్సిన వారి వివరాలను సర్కార్‌కు నివేదించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
భువనగిరి కలెక్టరేట్ సబ్సిడీ గొర్రెల పథకానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో 34,045 మంది లబ్ధిదారులను గుర్తించారు. మొదటి విడుతలో 17,083 మందిని ఎంపిక చేయగా.. 15,837 మందికి గొర్రెల యూనిట్లు అందజేశారు. పలు కారణాలతో 1,246 మందికి పెండింగ్‌లో ఉన్నాయి. రెండో విడుతలో 16,955 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలు అందజేయాలని నిర్ణయించారు. అందులో 2,770 మంది లబ్ధిదారులకు ఇప్పటికే గొర్రెలు పంపిణీ చేశారు. మిగిలిన 14,185 మందికి త్వరలో అందించేందుకు సిద్ధం చేస్తున్నారు.
సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 35,500 మందిని గుర్తించారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన 17,878 మందికి గొర్రెల యూనిట్లు అందజేసి వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న రెండో విడుతలో మరో 17,622 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
2017 సంవత్సరంలో గొర్రెల ధరలు కాస్త తక్కువగా ఉండటంతో అప్పట్లో యూనిట్ కాస్ట్ రూ.1.25లక్షలుగా నిర్ణయించారు. ఇందులో 75శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం గొర్రెలను అందజేసింది. లబ్ధిదారుడు తన వాటా కింద రూ.31,250 చెల్లిస్తే ప్రభుత్వం రూ.93,750 చెల్లించి గొర్రెలు అందజేసింది. ఈ ధరలోనే గొర్రెల కొనుగోలు, రవాణా చార్జి, ఇన్సూరెన్సు, దాణా సమకూర్చేవారు.
ప్రస్తుతం మాంసం ధరలు పెరుగడంతో గొర్రెల ధరలు సైతం భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75లక్షలకు పెంచింది. ఇందులో ప్రభుత్వం 75శాతం సబ్సిడీ కింద రూ.1,31,250 ఇవ్వనుండగా, లబ్ధిదారుడు తన వాటా కింద రూ.43,750 చెల్లించాల్సి ఉంది. లబ్ధిదారులు తన వాటాను కలెక్టర్ పేరిట డీడీ తీసి పశు సంవర్ధ్దక శాఖ కార్యాలయంలో అందజేస్తే ప్రభుత్వం ప్రకటించిన వెంటనే స్కీం ప్రారంభమవుతుంది.
గొర్రెల పథకం ద్వారా జిల్లాలో 64,818 మందికి లబ్ధి చేకూరుతున్నది. అందులో లిస్ట్ ఏ కింద 2017-18 ఆర్థిక సంవత్సరంలో 32,668 మందికి గాను బ్యాంకు ఖాతాలు, ఇతర కారణాల కారణంగా 28 మందికి మినహా మిగిలిన వారందరికీ గొర్రెలు అందజేశారు. లిస్ట్ బీలో 32,150 మందికి అందజేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ స్కీం కింద 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును అందజేస్తున్నారు.
లబ్ధిదారుడే క్షేత్ర స్థాయికి వెళ్లి నచ్చిన గొర్లను తీసుకునే అవకాశం ఉంది. త్వరలోనే రెండో విడుత గొర్రెల పంపిణీ చేస్తామని ఇటీవల రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హైదరాబాద్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంపిక చేసిన వారి నుంచి డీడీలు తీసుకోవాలనే ఆదేశాలు ఆ శాఖ యంత్రాంగానికి అందాయి.
2017లో 75శాతం సబ్సిడీతో జిల్లాలో ఏ లిస్ట్ కింద గుర్తించిన లబ్ధిదారులకు గొర్రెలు అందజేశాం. తాజాగా లిస్ట్ బీ కింద ఎంపికైన వారికి అందజేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. గతంలో యూనిట్ కాస్ట్ రూ.1.25లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.1.75 లక్షలకు పెరిగింది. లబ్ధిదారుడి వాటా గతంలో 25శాతం కింద రూ.31,250 చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.43,750కి పెరిగింది. అధికారికంగా ప్రభుత్వ ఆదేశాలు రాగానే కలెక్టర్ పేరిట డీడీలు తీసుకొని ప్రక్రియను ప్రారంభిస్తాం.
– శ్రీనివాసరావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ