యాదాద్రి, ఆగస్టు 1 : స్వయంభువులుగా వెలిసిన యాదాద్రి ఆలయ ప్రాశస్త్యం కోల్పోకుండా అద్భుతంగా పునర్నిర్మించడం మాటలు కాదు. ఆలయ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా కేవలం ప్రభుత్వ ఖజానాతోనే నిర్మించారు. మొదట యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం రూ.1800 కోట్లు అంచనా వ్యయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అన్నింటినీ సమన్వయం చేసుకోవడంతో దాదాపు రూ. 1200 కోట్ల పరిమితమైంది. ఇందులో ప్రధానాలయానికి రూ. 280 ఖర్చు చేశారు.
భూ సేకరణకు ప్రధాన వ్యయం జరిగింది. దాదాపు 1900 ఎకరాలను సేకరించారు. దాంతో పాటు రోడ్లు, కాటేజీల నిర్మాణం, ల్యాండ్‌స్కేపింగ్‌కు భారీగానే ఖర్చు చేశారు. యాదాద్రి చుట్టూ ఒక కొత్త ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించామనడంలో అతిశయోక్తి లేదు. నిత్యం లక్ష మంది వచ్చినా ఆటంకాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం యాదగిరిగుట్టలో ప్రధాన రోడ్డు, వైకుంఠ ద్వారం ఇరువైపులా ఉన్న దుకాణాలు, కొండ చుట్టూ నిర్మించిన వలయ రహదారుల చుట్టూ ఇండ్లను తొలగించాల్సి వచ్చింది.
గతంలో వారికి ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధితులకు అండగా నిలిచారు. భూములు, ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి నష్ట పరిహారంతో పాటు వైటీడీఏ పరిధిలో ప్లాట్, కొండ కింద నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక దుకాణం కేటాయించారు. స్వామి వారి వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట రోడ్డు వరకు, అంజనాపురి, గాంధీనగర్, నల్లపోచమ్మ వాడ ప్రధానరోడ్డు, హనుమాన్ ఆలయ ప్రాంతం, పాత చెక్ పోస్టు, తులసీ కాటేజీ ప్రాంతంలో మొత్తం 165 మందికి దుకాణాలు, 290 మందికి ఇండ్ల స్థలాల ప్రొవిజినల్ సర్టిఫికెట్లు మంజూరు చేశారు.
యాదాద్రి ఆలయ అభివృద్ధిలో స్థానికులు ఏ ఒక్కరూ కూడా నష్టవాటిల్లొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినహామీ ప్రకారం ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ గజానికి రూ.12 వేల చొప్పున నష్ట పరిహారంతో పాటు స్థలం కోల్పోయిన తీవ్రతను బట్టి ఒక్కొక్కరికీ 100 నుంచి 250 గజాల ప్లాట్ ప్రభుత్వం కేటాయించింది. వైటీడీఏ పరిధిలోని సర్వే నంబర్ 329లో 10 ఎకరాలు, 314 లో 11 ఎకరాల భూమిని కేటాయించారు. 329 సర్వే నంబర్లో 100 గజాలు 55 ప్లాట్లు, 150 గజాలలో 36 ప్లాట్లు, 200 గజాలలో 25 ప్లాట్లు చేసి ఉంచారు. వీటితో పాటు మరో 242 గజాలతో మరి కొన్ని ప్లాట్లు చేసి, 172 మందికి, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం(సర్వే నంబర్ 9,12)118 మంది బాధితులకు ప్రొవిజన్ సర్టిఫికెట్లను గతంలోనే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి లబ్ధ్దిదారులకు అందజేశారు. 19 గజాల ఇండ్ల స్థలం కోల్పోయిన బాధితులకు సైతం 100 గజాల ఇంటి స్థలం మంజూరు చేశారు. బాధితుల ప్లాట్లలో ఇండ్లు నిర్మించేందుకు మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే బీటీ రోడ్ల నిర్మాణాలు, విద్యుత్ సరఫరాకు కావాల్సిన స్తంభాలు బిగించారు. త్వరలో లే అవుట్ చేసి ఇండ్లను బాధితులకు కేటాయిస్తారు. ఇప్పటికే పలువురికి పట్టాలను పంపిణీ చేయగా, తాజాగా అంజనాపురి కాలనీవాసులకు ఇండ్ల పట్టాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 45 ఇండ్లు ఉన్నట్లుగా గుర్తించినట్లు వారు తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మొత్తం 327 కొత్త దుకాణాలు నిర్మిస్తున్నారు. కొండకింద లక్ష్మీపుష్కరిణి, ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్, సత్యనారాయణ వ్రతమండప ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. స్వామివారి వైకుంఠ ద్వారం నుంచి పాతగుట్ట చౌరస్తా, హనుమాన్ ఆలయ ప్రాంతం, పాత చెక్‌పోస్టు, తులసీ కాటేజీ ప్రాంతాలతో పాటు పాత రిజిస్ట్రేషన్ ప్రాంతాల్లో కోల్పోయిన 165 మందికి బాధితులకు ఉత్తరదిశలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కో దుకాణం కేటాయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రొవిజన్ సర్టిఫికెట్లను అందజేశారు.
గతంలో ఆలయ మాజీ ధర్మకర్తగా పనిచేశా. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత గొప్పగా ఆలయాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన రాలేదు. దాంతో పాటు యాదగిరిగుట్ట ప్రధానరోడ్డు, చుట్టూ రింగురోడ్డు నిర్మాణంలో భాగంగా ఇండ్లు, షాపులు స్థలాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారంతో పాటు నూతనంగా ఇండ్ల పట్టాలు అందించారు. ఇంకా పట్టాల పంపిణీ సాగుతున్నది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో యాద్రాది బాధితులు, ఆటో కార్మికులకు తప్పకుండా న్యాయం జరుగుతుంది.
– పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, ఆలయ మాజీ ధర్మకర్త
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ఇందులో మా నివాస స్థలాలు కోల్పోయాం. మాకు తిరిగి 314 సర్వే నంబర్లో ప్లాట్లు ఇస్తామని చెప్పారు. సంతోషంగా ఉంది.
-బబ్బూరి నర్సింహాగౌడ్, అధ్యక్షుడు, అంజనాపురి కాలనీ, యాదగిరిగుట్ట
ఆలయ నిర్మాణంలో ఇంటిని కోల్పోయిన మాకు ఇంటి స్థలాలు ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గతంలో మేం ఉన్న ఇండ్ల ప్రాంతంలో గిరిప్రదక్షిణ రోడ్డు వేశారు. ఇప్పుడు మాకు కొత్తగా ఆలయ ప్రాంతంలోనే ఇండ్ల స్థలం ఇస్తామని ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తెలిపారు. పూర్తిగా స్వాగతిస్తున్నాం.
– కందోజు మాధవి, అంజనాపురి కాలనీ, యాదగిరిగుట్ట