వరి నాట్లలో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు క్రమంగా డ్రమ్ సీడర్ విధానం వైపు మళ్లుతున్నారు. ఏటేటా ఈ విధానంలో సాగు చేసే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నాటు వేసే పద్ధతిలో పొలాన్ని ఏ విధంగానైతే సిద్ధం చేసుకుంటామో అదేవిధంగా పొలాన్ని సిద్ధం చేసుకుని 12 గంటల పాటు నానబెట్టిన విత్తనాలను డ్రమ్సీడర్లో వేసి విత్తుకోవాలి. ఈ విధానంలో సాగు వ్యయం తగ్గడంతో పాటు సమయం ఆదా అవడమే కాకుండా దిగుబడి సైతం అధికంగా పొందవచ్చు.
డ్రమ్ సీడర్ పద్ధతిలో రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. విత్తనంలో పొదుపు, నారు పెంచడం, నాటడం వంటి ఖర్చులు ఉండవు. నీటిని కూడా ఆరుతడుల పద్ధతిలో పెట్టుకోవచ్చు. విత్తనాలు వరుసలో పడడంతో కోనోవీడర్ ద్వారా కలుపును నివారించవచ్చు. వరి దుబ్బు కూడా అధికంగా పెరుగుతుంది. మొక్కలు దూరంగా ఉండడంతో గాలి, సూర్యరశ్మి బాగా తగిలి చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది.
– పెద్ది శ్రీనివాస్‌గౌడ్, ఏఓ, మేళ్లచెర్వు
నాటు పద్ధతి కన్నా డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి పంట 15 రోజుల ముందుగానే కోతకు రావడమేగాక, రెండు బస్తాల దాకా అధిక దిగుబడి వస్తుంది. నేను ఎప్పుడూ ఇంట్లో తయారు చేసిన సేంద్రియ ఎరువులనే వాడుతుంటాను. గత పదేండ్లుగా ఈ పద్ధతిలో పంటలు పండిస్తున్నాను. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది.
– సోమిరెడ్డి వెంకట్‌రెడ్డి, రైతు, ఎర్రగట్టుతండా