ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ఉప్పొంగుతున్నది. వరద కారణంగా హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తడంతో ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్వర్టులు, కత్వాలు పొంగి పొర్లుతున్నాయి. వలిగొండ మండలంలోని సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్యనున్న వంతెన పైనుంచి ప్రవాహం రెండడుగుల మేర ఉండడంతో జిల్లా కేంద్రం నుంచి చౌటుప్పల్ డివిజన్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. బీబీనగర్-భూదాన్‌పోచంపల్లికి అనుసంధానంగా ఉన్న కల్వర్టులపై నుంచి వరద పోటెత్తుతుండడంతో రెండు మండలాల మధ్య రవాణా స్తంభించింది.
ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ పలుచోట్ల పోలీసులు బారికేడ్లను ఏర్పాటుచేశారు. మరోవైపు బిక్కేరు వాగు కూడా తోడవడంతో మూసీ ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం 5 గంటలకు 14,086 క్యూసెక్కులు ఉన్న రాత్రి 8 గంటలకు 29,621 వేల క్యూసెక్కులకు చేరింది. ఉప్పెనను ముందే ఊహించిన అధికారులు అందుకగుణంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తూ, ముప్పు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
నాలుగైదేండ్లుగా భారీ వర్షాలు పడుతుండగా మూసీనది జలకళను సంతరించుకుంటూ వస్తున్నది. మూసీ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు గడుస్తుండగా 30 రోజుల పైనే దిగువకు నీటి విడుదల కొనసాగింది. తాజాగా హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు తోడు పైనుంచి వస్తున్న వరదతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు వరంగల్ జిల్లా నుంచి వచ్చే బిక్కేరు వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తూ మూసీలో కలుస్తున్నది. దాంతో మూసీ ప్రాజెక్టుకు భారీ ఇన్‌ఫ్లో నమోదవుతున్నది.
సూర్యాపేట, జూలై 27 (నమస్తే తెలంగాణ)
మూసీ ప్రాజెక్టుకు బుధవారం ఉదయం 5,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా గంటగంటకు పెరుగుతూ వస్తున్నది. రాత్రి 8 గంటల వరకు 29,621 క్యూసెక్కులకు చేరింది. అర్ధరాత్రి వరకు మరో 4 వేల క్యూసెక్కులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు మరో 6వేల క్యూసెక్కుల నీరు మూసీలోకి వస్తున్నది. వీటితోపాటు వరంగల్ జిల్లా నుంచి బిక్కేరు వాగు ద్వారా 6వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. మొత్తం 30వేల పైనే క్యూసెక్కులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూసీ డ్యామ్‌కు ముప్పు జరుగకుండా 25,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో మూసీకి ఇన్‌ఫ్లో భారీగా పెరిగింది. ఏ స్థాయిలో ఇన్‌ఫ్లో వచ్చినా బ్యాలెన్స్ చేసుకునేలా చర్యలు చేపడుతున్నాం. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-చంద్రశేఖర్, మూసీ ప్రాజెక్టు డీఈ
వలిగొండ : వలిగొండ మండల పరిధిలో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. భీమలింగం కత్వా దగ్గర పరవళ్లు తొక్కుతున్నది. సంగెం -బొల్లేపల్లి గ్రామాల మధ్య ఉన్న వంతెన పైనుంచి సుమారు రెండు అడుగుల మేర ప్రవహిస్తున్నది. దాంతో భువనగిరి నుంచి చౌటుప్పల్ డివిజన్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి వద్ద పోలీసులు రక్షణగా ఉన్నారు.
మూసీకి వరద పోటెత్తడంతో బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో రవాణా స్తంభించిపోయింది. బీబీనగర్ -పోచంపల్లి మండలాలకు అనుసంధానంగా ఉన్న కల్వర్టుపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తప్పని పరిస్థితుల్లో బట్టుగూడెం, పెద్దరావులపల్లి మీదుగా ప్రజలు ప్రయాణాలు సాగించారు. రుద్రెల్లి గ్రామం వద్ద కూడా మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో బీబీనగర్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు 8 గేట్ల ద్వారా బుధవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతూ వస్తున్నది. దాంతో ప్రాజెక్టు 8 క్రస్టు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 25,800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి కాల్వకు 169.24 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 84.62 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,621 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 637.10 అడుగులు(2.59 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్‌కుమార్ తెలిపారు.
మునగాల : వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల బుధవారం మండలంలోని మాధవరం చెరువు అలుగు పోస్తున్నది. ఆ నీటితో తాడ్వాయి గ్రామ శివారులో ఉన్న గురప్పవాగు పొంగి పొర్లుతున్నది. దాంతో తాడ్వాయి వద్ద రోడ్డుమీద నుంచి ఆరు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో తాసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ కృష్ణమూర్తి రోడ్డు దాటకుంటా రక్షణ చర్యలు ఏర్పాటు చేయించారు. అలాగే గణపవరం గ్రామ శివారులో వాగు పొంగడంతో కొక్కిరేణి రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. పొంగుతున్న వాగులు, రోడ్లు దాట వద్దని అధికారులు సూచించారు.
ఆత్మకూర్.ఎస్, జూలై 27 : మండలంలోని నశింపేట వద్ద పైనుంచి వస్తున్న వరదతో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దాంతో తాసీల్దార్ హేమమాలిని బుధవారం పరిశీలించి రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. సందర్భంగా ఆత్మకూర్.ఎస్ క్రాస్ రోడ్ వద్ద హెచ్చరికలతో బారికేడ్లు ఏర్పాటు చేయించారు. ఈ రోడ్డుపై రాకపోకలు బంద్ కావడంతో ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఏపూరు వైపు నుంచి వచ్చే వారు రామన్నగూడెం, ముక్కుడుదేవులపల్లి, దంతాలపల్లి మీదుగా.. లేదా రామోజీతండా, తెట్టెకుంటతండా, కోటపహాడ్, తుమ్మలపెన్‌పహాడ్ క్రాస్‌రోడ్ మీదుగా వెళ్లాలని తెలిపారు. సూర్యాపేట నుంచి ఏపూరు వైపు వెళ్లే వారు ఆత్మకూర్.ఎస్ క్రాస్ రోడ్డు నెమ్మికల్ నుంచి దంతాలపల్లి రోడ్డు మీదుగా ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూరుకు చేరుకోవాలని చెప్పారు.