సూర్యాపేట టౌన్, జూలై 27 : ఉద్యోగార్థులంతా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతోపాటు భోజన సదుపాయం, ఉచిత శిక్షణ కల్పిస్తున్న ఎస్.ఫౌండేషన్‌కు మంచి పేరు తేవాలని గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఆకాంక్షించారు. సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో గత రెండు నెలలుగా ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్.ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉచితంగా భోజన వసతితోపాటు ప్రత్యేక నిపుణులతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు విభాగాల్లో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులు ఎంతో మంది ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని తెలిపారు.
ఆయా శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారు స్వయంగా వచ్చి తమతో ఆనందాన్ని పంచుకున్న సంఘటనలను గుర్తు చేశారు. అనంతరం 216 మందికి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగార్థులు రామచంద్రా రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎస్.ఫౌండేషన్ సీఈఓ మాదంశెట్టి వీరన్న, యాదవరెడ్డి, బూర బాల సైదులు, కీసర వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, దేశగాని శ్రీను, కొమ్ము ప్రవీణ్, మధు పాల్గొన్నారు.