అడ్డగూడూరు, జూలై 27 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకొని సంపద సృష్టించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. 15 మంది దళితబంధు లబ్ధిదారులకు బుధవారం మండలకేంద్రంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి యూనిట్లు అందించారు. లబ్ధిదారులకు 9 ట్రాక్టర్లు, కారు, ఆటో, అశోక్ లీల్యాండ్ వాహనం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఇతరులకు ఉపాధి చూపుతూ తామూ అభివృద్ధి చెందాలని సూచించారు. నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రస్తుత బడ్డెట్‌లోనూ ప్రభుత్వం నియోజకవర్గానికి మరో 1500 యూనిట్లు మంజూరు చేసిందని, అడ్డగూడూరు మండలానికి 152 యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రతి గ్రామానికి 10 యూనిట్ల చొప్పున ఇవ్వనున్నట్ల చెప్పారు. అనంతరం మండలకేంద్రంలోని గోధుమకుంట కట్టకు ఎక్త్సెజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఈత, తాటి, మెక్కలను నాటగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.
మండలంలోని జానకిపురంలో ఎస్డీఫ్ నిధులతో చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.7.50 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. చౌళ్లరామారం నుంచి జానకిపురం వరకు ఉన్న బీటీ రోడ్డు దెబ్బతిన్నదని, గ్రామస్తులు తెలుపగా రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మాణానికి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకుల శ్యాంసుందర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్, ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీ అయోధ్య, తాసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ చంద్రమౌళి, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, జిల్లా కోఆప్షన్ సభ్యుడు గుండిగ జోసఫ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చౌగోని సత్యంగౌడ్, సర్పంచులు బాలెంల త్రివేణి, కొప్పుల మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు పెండెల భారతమ్మ, మొర్రి బాలమ్మ, నాయకులు శ్రీరాముల అయోధ్య, కంచర్ల చలపతిరెడ్డి, కమ్మంపాటి పరమేశ్, లింగాల అశోక్‌గౌడ్, పూలపల్లి జనార్దన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.