నల్లగొండ, జూలై 27: అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన 75 అమృత్ సరోవర్ పాండ్స్‌ను ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ రాహు ల్‌శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయా శాఖల అధికారులతో పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాల బయో ఫెన్సింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన వాటి ఫొటోలను పంపించాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో పంచాయతీ కార్యదర్శులు పాత్ర కీలంగా ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ స్థలాలను క్రీడా ప్రాంగణాలుగా మార్చాలాన్నారు.
లేఅవుట్స్ ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను గుర్తించాలన్నారు. అటవీ శాఖ భూముల్లో మొక్కలు నాటాలని సమస్యలు ఉంటే చెప్పాల న్నారు. హరితహారం కింద నూరుశాతం మొక్కలు నాటాలని, మండల స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు నిర్వహించాలని పంచాయితీ అధికారికి సూచించారు. ఉపాధి పథకంలో పెండింగ్ మస్టర్లు పూర్తి చేయడంతోపాటు రిజెక్టెడ్ అకౌంట్లను సరిచేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్సులో జడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్ రెడ్డి, డీఆర్డీఓ కాళిందిని, డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పారిశుధ్యం సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని వసతి గృహాలు, విద్యాసంస్థల్లో పారిశుధ్యం సక్రమంగా నిర్వహిస్తూ మిషన్ భగీరథ నీరు, ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్, ఆంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని పంచాయతీ, మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. పౌరసరఫరాల యంత్రాంగం విద్యార్థులకు నాణ్యమైన బియ్యం పంపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వార్డెన్లు ప్రిన్సిపాల్స్ విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ఆదేశించారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. అద్దె భవానాలు, స్వంత భవనాలు ఎన్ని అనేది వెంటనే నివేదించాలన్నారు. సమావేశంలో షెడ్యూల్ కులాల అధికారి సల్మాభాను, గిరిజన సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, మైనార్టీ సంక్షేమ అధికారి బాలకృష్ణ, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సైప్లె డీఎం నాగేశ్వర్రావు, ఆర్సీఓలు పాల్గొన్నారు.