నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ఆయకట్టుకు నీటి విడుదల కోసం సర్వం సిద్ధమైంది గురువారం ఉదయం 9.30గంటలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పొట్టిచెల్మ వద్ద లాంఛనంగా నీటిని వదులనున్నారు. అందుకోసం మంత్రి బుధవారం రాత్రే నాగార్జునసాగర్‌కు చేరుకున్నారు. స్వరాష్ట్రంలో కృష్ణా జలాల వాటా వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుండడంతో సాగర్‌ను ముందుగానే వరద తాకుతున్నది.
ఫలితంగా సకాలంలో నీటి విడుదలకు మార్గం సుగుమమవుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జూలైలోనే ఎడమకాల్వకు నీటి విడుదల చేస్తుండడం ఇదే తొలిసారి. దాంతో ఆయకట్టు రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతున్నది. నేటి నీటి విడుదల కార్యక్రమానికి సమీప ప్రాంతాల్లోని రైతులు కూడా తరలివెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై27(నమస్తే తెలంగాణ) : భారీ వర్షాలతో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు పూర్తిగా నిండిపోయాయి. దిగువన ఉన్న నాగార్జునసాగర్ నిండాల్సి ఉంది. బుధవారం సాయంత్రానికి సాగర్‌కు 62,706 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. గతేడాది ఇదే రోజున సాగర్‌లో 539.10 అడుగుల మేర 186.45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఆగస్టు 5వ తేదీన సాగునీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో గతేడాదితో పోలిస్తే అదనంగా 11 అడుగల మేర అదనంగా నీరు ఉండడంతో ముందస్తుగానే సాగునీటి విడుదలకు ఏర్పాట్లు చేశారు.
నేడు ఉదయం 9.30గంటలకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రైతులతో కలిసి ఆయకట్టు ప్రాంత ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. దీంతో 2018 నుంచి వరుసగా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసినట్లు అవుతుంది. స్వరాష్ట్రంలో 2015లో వర్షాభావ పరిస్థితులతో నీటి విడుదల జరుగకపోగా 2017లో మాత్రం అక్టోబర్ 31వ తేదీన నీటి విడుదల జరిగింది.
కానీ మిగతా అన్ని సంవత్సరాల్లోనూ ఆగస్టు నెలలో సాగునీటి విడుదల జరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది మరింత ముందస్తుగా సాగునీటి విడుదల జరుగుతుండడంతో ఆయకట్టులో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కింద రెండు రాష్ర్టాల్లో కలిపి దాదాపు 11లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. వరుసగా ఐదో ఏడాది కూడా ఆన్‌అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందే సూచనలు మెండుగా ఉన్నాయి.
మరో మూడు నెలల పాటు కృష్ణానదిలో వరదలకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా పరిస్థితి పూర్తి ఆశాజనకంగా కనిపిస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతుల్లో చాలా మంది నారుమళ్లు పోసుకోగా మరికొందరు సిద్ధమవుతున్నారు. నారుమళ్లు ముందు సిద్ధం చేసుకున్న వారు త్వరలోనే వరినాట్లకు కూడా సన్నద్ధం కానున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక డిమాండ్‌గా ఉంటూ వచ్చిన నీళ్ల అంశంపై సీఎం కేసీఆర్ నిబద్ధతకు నాగార్జునసాగర్ ప్రాజెక్టునే నిదర్శనం. గతంలో శ్రీశైలం డ్యామ్ నిండి క్రస్ట్‌గేట్లు ఎత్తితే తప్ప అప్పటివరకు సాగర్‌కు చుక్క నీరు విడుదల చేసే వారు కాదు. వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక ప్రారంభమైతే విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్‌కు విడుదల చేయవచ్చు. కానీ సమైక్య పాలకులు శ్రీశైలం నీటిని రాయలసీమకు తరలించడానికి వీలుగా ఆ పని చేసే వారు కాదు.
దీంతో సాగర్ ఆయకట్టు రైతాంగం తీవ్రంగా నష్టపోయేది. సరైన వర్షాలు లేని సమయంలో సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల సమస్యాత్మకంగా మారేది. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తున్నారు. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు పైనుంచి వరద ప్రారంభమైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో కరెంటు ఉత్పత్తిని ప్రారంభిస్తున్నారు. పవర్ జనరేషన్‌తో పాటు ఆ నీరంతా సాగర్‌కు తరలివస్తుంది.
దీని వల్ల శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లతో సంబంధం లేకుండానే ఆ లోపే 10 నుంచి 20 అడుగుల వరకు నీరు సాగర్‌కు చేరకుంటుంది. దీనివల్ల సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు సకాలంలోనే సాగునీటి విడుదలకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. 2018 నుంచి ఇదే తరహాలో శ్రీశైలానికి వరద ప్రారంభమైన నాటి నుంచే నీటి తరలిస్తుండడం ద్వారా ఆయకట్టుకు ఢోకా లేకుండా పోయింది. ఈ సీజన్లోనూ ఈ నెల 12వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మొదలుకాగా తర్వాత రోజు నుంచే పవర్ జనరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఆభ్యంతరం వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు.
దీంతో శ్రీశైలంలో పవర్ జనరేషన్ ప్రారంభించే సమయానికి నాగార్జునసాగర్‌లో 528.41 అడుగుల నీరు నిల్వ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాజలాల వినియోగంలో అనుసరిస్తున్న వ్యూహంతో బుధవారం సాయంత్రానికి సాగర్‌లో 209.77 టీఎంసీల సామర్థ్యంతో 550 అడుగుల నీరు అందుబాటులోకి వచ్చింది. సుమారు 22 అడుగుల నీటిని అదనంగా సాగర్‌కు తరలించారు. దీంతోనే ఇప్పుడు సాగునీటి విడుదలకు జూలై చివరల్లోనే మార్గం సుగుమమైంది.
నందికొండ : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 62,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 590(312 టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 550.10 (209.99టీఎంసీలు) అడుగులు ఉంది. ఎస్ఎల్బీసీ ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా నీటి విడుదల లేదు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 880.10 అడుగుల నీరుంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 50,135 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.